నేడు నేషనల్ సైన్స్ డే
‘నేను ఇప్పటికీ విద్యార్థినే’అంటుంది విజయమ్మ. ఉపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ చేసిన విజయమ్మ మదిలో ‘విశ్రాంతి’ అనే ఊహ ఎప్పుడూ రాలేదు. ఆమె ఇల్లు పెద్దబడి. చిలుకలు వాలిన చెట్టులా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. ‘సామాజిక సేవాకార్యక్రమాల్లోనే సంతోషం’ అని చెబుతున్నట్లుగా ఉంటుంది. ‘నేను నిత్య విద్యార్థిని’ అని చెప్పే విజయమ్మ మాటను అక్షరాలా నిజం చేయడానికన్నట్టు ఇప్పటికే ఐదు డిగ్రీలు, 4 పీజీ కోర్సులు పూర్తి చేసి పదవ కోర్సుకు సిద్ధమవుతోంది.
ఉద్యోగానికి ఉత్సాహం తోడైతే ఆ శక్తే వేరు. ఆ శక్తి విజయమ్మలో కనిపిస్తుంది. ఉద్యోగ విధులకు సామాజిక బాధ్యతను కూడా జోడించడం ఆమె ప్రత్యేకత. తాను ఉద్యోగం చేసిన ప్రతి గ్రామంలో విద్యాబోధనతోపాటు పర్యావరణ సంరక్షణ గురించి పిల్లలకు అవగాహన కలిగించేది. ఆయా గ్రామాలలో వందల మొక్కలను నాటించింది. బాలికల చదువు విషయంలో ప్రత్యేక చొరవ చూపేది. ‘ఇప్పటి నుంచే మీకంటూ ఒక కల ఉండాలి’ అని చెబుతుండేది.
పేదరికాన్ని జయించి, ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి గొప్పస్థానంలో నిలిచిన ఆదర్శనీయ మహిళల గురించి చెబుతూ ఉండేది. వింజమూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, నెల్లూరు రూరల్ తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహించిన విజయమ్మ ఇందుకూరుపేట మండలం కొత్తూరు హైస్కూల్లో ఉపాధ్యాయినిగా ఉద్యోగ విరమణ చేసింది. రోజూ ఎంతో ఉత్సాహంగా స్కూల్‌కు వెళ్లే విజయమ్మకు ఉద్యోగ విరమణ తరువాత స్కూలు దూరం అయింది. అయితే ఉత్సాహం దూరం కాలేదు. జనవిజ్ఞాన వేదిక ద్వారా సామాజిక కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటోంది.
మైపాడు గేటు సమీపప్రాంతంలో ఆమె ఉండే ఇల్లు పిట్టలు వాలిన చెట్టులా ఎప్పుడూ కళకళగా ఉంటుంది. విజయమ్మ పదవీ విరమణ చేసినా ఇప్పటికీ స్థానికులతో సహా ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు వస్తూనే ఉంటారు. విద్యార్థుల కోసం పుస్తకాలతోపాటు డ్రాయింగ్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. విజయమ్మ ఇంట్లో ఒక మూల పుస్తకాలు చదువుకునే, ఒక మూల పెయింటింగ్ వేసే అమ్మాయిలు కనిపిస్తుంటారు. ఆమె మార్గదర్శకత్వంలో రోడ్డుకు ఇరువైపులా, రైల్వే గేట్.. మొదలైనప్రాంతాల్లో విద్యార్థులు విరివిగా మొక్కలు నాటుతున్నారు.
అవయవ దానంతో పాటు శరీర దానాలు చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ‘సింహపురి దేహ సమర్పణ’ సంస్థను విజయమ్మ ప్రారంభించింది. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి శరీరాన్ని వైద్యశాలలకు దానం చేసేలా చొరవ చూపుతుంది. ఇప్పటివరకు నలుగురి మృతదేహాలను ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలకు అందజేసింది. ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే నష్టాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తోంది.
పనిలోనే ఆనందం
రోజూ బడికి వెళుతున్నప్పుడల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేది. విద్యార్థులలో విద్యార్థిగా మారిపోయేదాన్ని. ఇప్పుడు స్కూల్‌కు వెళ్లే అవకాశం లేకపోయినా విద్యార్థులకు దూరం కాలేదు. ఇప్పటికీ ఎంతోమంది విద్యార్థులు నా దగ్గరికి వస్తుంటారు. మేమందరం కలిసి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ‘హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకోకుండా ఇవన్నీ ఎందుకు?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే నాకు పనిలోనే ఆనందం దొరుకుతుంది. మనం చేయడానికి ఈ సమాజంలో ఎన్నో మంచి పనులు ఉన్నాయి. మనం అనుకున్నవాటిలో కొన్ని చేయగలిగినా ఎంతో సంతోషం, ఎంతో శక్తి వస్తుంది.
– విజయమ్మ
– వల్లూరు సాంబశివరావు, సాక్షి, పొగతోట, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment