
చిన్న చిన్న గాయాలైనప్పుడూ జాగ్రత్త..!. రక్తం కారడం సహజమే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు ఆరోగ్యనిపుణులు. ఒకవేళ అనుకోకుండా గాయమైనా..రక్తం కారి కాసేపటికి కంట్రోల్ అవ్వాలి. లేదంటే అది హిమోఫిలియా రుగ్మతే అయ్యి ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అలాంటి బాధితులు తక్షణమే వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. ఇవాళ ఏప్రిల్17 ప్రపంచ హిమోఫిలియా దినోత్సవం సందర్భంగా అసలేంటి వ్యాధి..? దీనికి చికిత్స ఏంటి తదితరాల గురించి తెలుసుకుందాం.
చాలామంది హీమోఫిలియా అనే వ్యాధి గురించి తెలియదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 17న హీమోఫిలియా అవేర్‌నెస్ డే నిర్వహిస్తున్నారు.
హీమోఫిలియా అంటే
హీమోఫీలియా అనే పదం హెమోరాఫిలియా అనే పదానికి సంక్షిప్త రూపం. దీన్ని జ్యూరిచ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డాక్టర్ షోన్లీన్ , అతని అసోసియేట్ ఫ్రెడరిక్ హాప్ఫ్ సృష్టించారు. రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అరుదైన జన్యు వ్యాధి 'హిమోఫిలియా'. ఇది వారసత్వంగా తల్లి దండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది.
అలాంటి వారికి ఎముక సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, వాపు, అంతర్గత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన సమయంలో నిర్ధారణ చేసి మందులు వాడకపోతే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది.
'రాయల్ డిసీజ్'..
ఈ సమస్య ఈనాటిది కాదు. ప్రాచీన ఈజిప్టు కాలం నుంచి దీని తాలుకా కేసులు నమోదయ్యాయట. అంతేగాదు దీన్ని 'రాయల్ డిసీజ్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈజిప్ట్‌రాణి విక్టోరియాకి ఈ వ్యాధి ఉందట. అలాగే ఆమెకు పుట్టిన తొమ్మిది మంది పిల్లల్లో ముగ్గురికి ఈవ్యాధి ఉందని, వారికి వారసత్వంగా వచ్చిందని అప్పుడే నిర్థారించారు వైద్య నిపుణులు.
ఎందువల్ల ఇలా అంటే..
సాధారణంగా ఎప్పుడైనా శరీరానికి గాయమైతే, రక్తస్రావం అవ్వడం మొదలవుతుంది. ఈ రక్తస్రావాన్ని ఆపేందుకు క్లాట్ ఏర్పడి, ప్లేట్‌లెట్స్ రక్తాన్ని చిక్కపరుస్తాయి. ఇలా రక్తస్రావం ఆగిపోతుంది. కానీ, హీమోఫిలియా ఉన్న వారికి శరీరంలో రక్తం గడ్డకట్టే కణాలు తక్కువగా ఉంటాయి. దీంతో వారికి గాయం అయితే రక్తం ధారగా శరీరం నుంచిపోతూనే ఉంటుందట.
ఇక ఈ వ్యాధి ఏ,బీ అని రెండు రకాలుగా ఉంటుందట.
ఈ వ్యాధి వల్ల ఒక వ్యక్తి తన శరీరంలో రక్తం గట్టకట్టడానికి అవసరమైన ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునేందుకు వీలుండదు. దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుంది.
హీమోఫిలియా బీ ఉన్న వారు తమ బ్లడ్ ప్లాస్మాలో ప్రొటీన్‌ను అంటే ఫ్యాక్టర్ 9ను సహజంగా ఉత్పత్తి చేసుకోలేరు. ఇప్పటి వరకు ఈ రోగులు ఫ్యాక్టర్ 9 కోసం ఇంజెక్షన్లు తీసుకోవాల్సిందే. వారంలో పలుసార్లు వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ వ్యాధి జన్యుపరంగా వస్తుంది. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే, పిల్లలకు కూడా ఇది సంక్రమించే అవకాశం ఉంది. ఈ వ్యాధి సోకేందుకు ఇతర కారణాలు చాలా తక్కువని అంటున్నారు నిపుణులు. ఇది చాలా అరుదైన వ్యాధని చెబుతున్నారు వైద్య నిపుణులు.
అంతేగాదు పదివేల మందిలో ఒకరికి హీమోఫిలియా -ఏ సోకుతుందని, 40 వేల మందిలో ఒకరికి హీమోఫిలియా బీ వస్తుందని చెప్పారు. చివరిగా..ఏ రూపంలో ఈ వ్యాధి సోకినా అది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు నిపుణులు
లక్షణాలు..
ఈ వ్యాధి లక్షణాలు స్వల్పంగా లేదా చాలా తీవ్రంగా ఉంటాయి
ముక్కు నుంచి రక్తం కారడం
పళ్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం
చర్మం తేలిగ్గా ఊడొస్తుంది.
శరీరం లోపల రక్తస్రావమవుతూ ఉండటంతో జాయింట్లలో నొప్పి
హీమోఫిలియా వల్ల తలలో ఇంటర్నల్‌గా రక్తస్రావమవుతుంది. తీవ్ర తలపోటు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
దీంతో పాటు, చిన్నవయసులోనే ముసలివాళ్లుగా మారడం, మెదడుకు సరైన సమయంలో రక్తం అందకపోవడంతో స్పృహ కోల్పోవడం, ముఖం అందవికారంగా మారడం వంటివి కూడా కనిపిస్తుంటాయి.
ఈ లక్షణాలు అతి కొద్ది మంది రోగులలో మాత్రమే కనిపిస్తాయి.
హీమోఫిలియా మూడు స్థాయుల్లో ఉంటుంది. స్వల్ప స్థాయిలో ఉన్నప్పుడు శరీరంలో 5 నుంచి 10 శాతం మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలుంటాయి.
మధ్యస్థంగా ఉన్నప్పుడు 1 నుంచి 5 శాతం మాత్రమే రక్తం గడ్డకట్టే కణాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ వ్యాధి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు, వీటి స్థాయి శరీరంలో కేవలం ఒక్క శాతం మాత్రమే ఉంటుంది.
ఈ పైలక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాల్సిందే.
చికిత్స ఏంటంటే..
నిజానికి కొన్నేళ్ల వరకు ఈ వ్యాధికి చికిత్స అనేది చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు రక్తం గడ్డకట్టేందుకు ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఒక వేళ ఈ వ్యాధి అంత ప్రమాదకరస్థాయిలో లేకపోతే ఔషధాలతో ఉపశమనం పొందొచ్చు.
అలాగే తోబుట్టువుల్లో ఒకరికి ఉండి మరొకరికి లేకపోయినా..కొంతకాలం తర్వాత వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయిన హెచ్చరిస్తున్నారు. ఇక హీమోఫిలియా బీ రకం వ్యాధి అయితే చికిత్స అత్యంత ఖరీదైనదే అంటున్నారు నిపుణులు.
ఇటీవలే అమెరికా దీనికి హెమ్‌జెనిక్స్ అనే ఇంజెక్షన్‌ని అందుబాటులోకి తీసుకువచ్చిందట. అయితే దీని ధర 3.5 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో దాదాపు 28 కోట్లు.). అంతేగాదు ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న ఔషధాల్లో ఇదే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్‌గా నిలిచింది.
ఇది అత్యంత అరుదైన వ్యాధికావడంతో దీని గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ప్రత్యేకంగా ఒక రోజుని ఏర్పాటు చేసి మరీ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు అధికారులు. ఈ ఏడాది థీమ్ "అరుదైన రక్రస్రావం రుగ్మత గురించి మహిళలు, బాలికలు అందరూ తెలుసుకోవాలి".. అనే నినాదంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
(చదవండి: ఆరోగ్యానికి అదే మార్గం..! సూచిస్తున్న పోషకాహార నిపుణులు)