చిన్నారులపై దద్దుర్ల పంజా | - | Sakshi
Sakshi News home page

చిన్నారులపై దద్దుర్ల పంజా

Published Fri, Sep 27 2024 3:52 AM | Last Updated on Fri, Sep 27 2024 3:52 AM

చిన్నారులపై దద్దుర్ల పంజా

ప్రత్తిపాడు: ప్రత్తిపాడులో పెద్దలకు జ్వరాలు, పిల్లలకు దద్దుర్లు వస్తుండటంతో తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతోపాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. క్షీణించిన పారిశుధ్యం, కలుషిత నీటితో ప్రజలను అంతుచిక్కని రోగాలు చుట్టుముడుతున్నాయి.

గతంలో ఎన్నడూ లేనివిధంగా చిన్నారులకు దద్దుర్లు వచ్చి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కాళ్లు, చేతులతోపాటు శరీరంపై పెద్ద బొబ్బలు వస్తున్నాయి. మరికొందరికి నీటి బుడగల మాదిరిగా దద్దుర్లు రావడంతో నొప్పులు, మంటతో నరకయాతన అనుభవిస్తున్నారు. తల్లిదండ్రులు వారిని తీసుకుని ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. వారం రోజులుగా పలువురు చిన్న పిల్లల ప్రైవేట్‌ ఆస్పత్రులు, ఆర్‌ఎంపీల వద్దకు క్యూ కడుతున్నారు. పెద్దల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వైరల్‌ జ్వరాలతోపాటు తీవ్ర ఒళ్లు నొప్పులు, జలుబు, దగ్గులతో నానా అవస్థలు పడుతున్నారు.

దోమలు, కలుషిత నీరే కారణమా?

చిన్నారులకు వచ్చిన సమస్యలేంటో అర్థం కాక పెద్దలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇందుకు కారణం కలుషిత నీరు, దోమ కాటుగా భావిస్తున్నారు. దోమల నివారణకు గ్రామ పంచాయతీ, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోగాల నిర్ధారణ పరీక్షల కోసం ల్యాబ్‌లు, వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగి రూ. వేలు ఖర్చు చేస్తున్నారు. అధికంగా ఇలాంటి దద్దుర్లు, చర్మవ్యాధులు కలుషిత నీటి వల్ల వస్తాయని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతున్నా.. కనీసం వైద్య ఆరోగ్యశాఖకు చీమ కుట్టినట్లు కూడా లేదు. వైద్యాధికారి మొదలు సీహెచ్‌వో, సూపర్‌వైజర్లు వీటి నివారణకు కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. వారు మండలానికి నామమాత్రంగానే వస్తుండటం, ఫీల్డ్‌ విజిట్లను గాలికి వదిలేయడంతో స్థానికంగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఉన్నతాధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎంఎల్‌హెచ్‌పీలు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల మధ్య కనీస సమన్వయం లేకపోవడంతో ఆ ప్రభావం ప్రజారోగ్యంపై పడుతోంది.

కారణం తెలియక భయాందోళనలు జ్వరాలు, నొప్పులతో పెద్దల ఇక్కట్లు వ్యాధులబారిన ప్రత్తిపాడు ప్రజలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement