సాగు నీటి సంఘాల ఎన్నికలపై శిక్షణ
తెనాలి: సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలను సమర్థంగా నిర్వహించాలని తెనాలి సబ్ కలెక్టర్ వి.సంజన సింహ ఆదేశించారు. రైతులందరూ భాగస్వాములయేలా చూడాలని అధికారులకు సూచించారు. ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు శుక్రవారం కృష్ణాపశ్చిమ డెల్టా డివిజన్ కార్యాలయంలో నిర్వహించారు. ఇందులో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పొరపాట్లు జరగకుండా చూడాలని, మంచిపేరు తెచ్చుకోవాలని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను వీడియో తీయించాలని పేర్కొన్నారు. జల వనరుల శాఖ ఇన్‌చార్జి సూపరింటెండెంట్, తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పులిపాటి వెంకటరత్నం మాట్లాడుతూ కృష్ణాపశ్చిమ డివిజను పరిధిలో ఈ సంఘాలు మూడు జిల్లాలలో ఉన్నాయని చెప్పారు. డిసెంబరు 5న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని వెల్లడించారు. 8న సాగునీటి సంఘాలకు, 11న డిస్ట్రిబ్యూటరీ సంఘాలకు, 14 ప్రాజెక్టు కమిటీకి ఎన్నికలు జరుగుతాయని వివరించారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఎన్నికల విధులపై మాస్టర్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న జలవనరుల శాఖ చీరాల డీఈఈ ఎన్‌కేవీ ప్రసాద్ శిక్షణ ఇచ్చారు. దుగ్గిరాల డీఈఈ ఆర్.శ్రీనివాస్, డ్రైనేజీ డీఈఈ ఎం.అనిల్‌కుమార్, జలవనరుల కార్యాలయం సూపరింటెండెంట్ డీపీ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment