బాలికా విద్య కోసం తపించిన ఉన్నవ దంపతులు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలికా విద్యకోసం శ్రమించిన ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతులు చరితార్థులని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. బ్రాడీపేటలోని శ్రీశారదానికేతన్ మహిళా విద్యాసంస్థ 102వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ.. 1922లో బాలికా, మహిళా విద్య కోసం శారదానికేతనాన్ని స్థాపించిన ఉన్నవ దంపతులు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించారని అన్నారు. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి రచన దళితుల బాధలను, అంటరానితనాన్ని ఆనాటి ప్రజల కళ్లముందు ఉంచినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి వితంతువు వివాహాన్ని కందుకూరి వీరేశలింగంతో కలిసి గుంటూరులో చేయించారని తెలిపారు. గాంధీజీ శారదానికేతనాన్ని సందర్శించి స్వాతంత్య్ర ఉద్యమ నేతలతో సమావేశాన్ని నిర్వహించారని గుర్తుచేశారు. వీవీ గిరి, సి. రాజగోపాలాచారి వంటి మహనీయులు వార్షికోత్సవ సభలకు హాజరయ్యారని తెలిపారు. 10 మంది విద్యార్థినులతో ప్రారంభమైన శారదానికేతన్‌లో ప్రస్తుతం 400 మంది చదువుతున్నట్లు తెలిపారు. ప్రముఖ రంగస్థల, సినీ నటులు తూర్లపాటి రాధా కృష్ణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు సంగీతం, క్రీడల్లో ప్రావీణ్యం పొందాలని సూచించారు. తిరుప్పావై అమృత వర్షిణి డాక్టర్ కోగంటి శ్రీరంగనాయకి మాట్లాడుతూ.. శారదానికేతనం అభివృద్ధికి డాక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ, నాట్కో సంస్థ, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి, పోలిశెట్టి సోమసుందరం సంస్థలు ఎంతగానో తోడ్పాటును అందించినట్లు తెలిపారు. అనంతరం ఉన్నవ లక్ష్మీబాయమ్మ జీవిత సౌఫల్య పురస్కారాలను సీహెచ్ సుబ్రహ్మణ్యేశ్వరి, వేదవతికి ప్రదానం చేశారు. ప్రముఖ ప్రజా గాయకుడు పీవీ రమణ తన పాటలతో ఆలోచింపజేశారు. తొలుత ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో విశ్రాంత విద్యాశాఖాధికారి డాక్టర్ ఎన్. అరుణ కుమారి, విశ్రాంత వైద్యాధికారి పెద్ది సాంబశివరావు, ఉన్నవ కుటుంబ సభ్యులు హేమ, మాధవీలత, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.కోటిరత్నం, సంస్థ కార్య నిర్వహణాధికారులు జి. శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావు, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం ఎస్. ఉషారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment