● అర్బన్ పీహెచ్‌సీ వైద్యుల ఆవేదన ● కేంద్ర సహాయ మంత్రికి ఫిర్యాదు
గుంటూరు మెడికల్: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాత్రి వేళల్లో విధులు నిర్వహించలేని పరిస్థితి ఉందని పలువురు వైద్యులు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం గుంటూరు బృందావన్ గారెన్స్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ – ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ను మంత్రి పరిశీలించారు. వైద్యులు, సిబ్బందిని అక్కడి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డ్రెస్సింగ్ అండ్ ఎమర్జెన్సీ రూం, ఫార్మసీ, మెటర్నటీ, పురుషుల విభాగం, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాలను పెమ్మసాని పరిశీలించారు. వైద్యాధికారులతో మాట్లాడి హెల్త్ సెంటర్ నిర్వహణ, విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాల గురించి రోగుల వద్ద ఆరా తీశారు. రాత్రి వేళల్లో పలువురు ఆగంతుకులు అర్బన్ పీహెచ్‌సీ ప్రాంగణంలోకి గంజాయి మత్తులో వస్తున్నారని చెప్పారు. ఆ మత్తులో హెల్త్ సెంటర్ వద్ద ఆందోళన సృష్టిస్తున్నారని, రాత్రి వేళలో భద్రత లేదని పలువురు వైద్యులు ఫిర్యాదు చేశారు. అర్బన్ పీహెచ్‌సీ ప్రహరీ నిర్మాణం పెండింగ్‌లో ఉందన్నారు. మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ మరోసారి గంజాయి బ్యాచ్ ఆసుపత్రి పరిసరాల్లో కనిపించకుండా చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ప్రహరీ మంజూరైనా నిర్మాణం చేపట్టని కాంట్రాక్టర్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడారు. ఆలస్యానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం విలేకరులతో పెమ్మసాని మాట్లాడుతూ.. గుంటూరు జీజీహెచ్‌పై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోందని చెప్పారు. అందరూ స్థానికంగా ఉండే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకు వెళ్లకుండా జీజీహెచ్‌కి రావడమే ఒత్తిడి పెరగడానికి కారణమని పేర్కొన్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో సౌకర్యాలు ఉన్నాయని, అన్ని వ్యాక్సిన్లు కూడా వేస్తారని వెల్లడించారు. హెల్త్ సెంటర్ సమీపంలో ఉన్న రైతు బజార్‌ను కూడా మంత్రి పరిశీలించారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకున్నారు. చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే స్థానికంగా రైతు బజారుకు డిమాండ్ పెరుగుతుందన్న వ్యాపారుల విజ్ఞప్తి మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment