మిర్చి యార్డు ప్రగతికి కృషి ముఖ్యం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు సూచించారు. యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో యూనియన్ల నాయకులు, అధికారులు, సిబ్బందితో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొంతకాలంగా యార్డుపై వస్తున్న ఆరోపణల వల్ల యార్డుకు, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్, యార్డు పర్సన్ ఇన్‌చార్జి భార్గవ్ తేజ ఆదేశాలతో అన్ని సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిర్చి సీజన్ నాటికి ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా మిర్చి రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. యార్డులో తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను పెంచనున్నట్టు తెలిపారు. గేట్ల వద్ద ఏళ్ల తరబడి ఉన్న సిబ్బందిని పూర్తిగా తొలగించడంతోపాటు యార్డు ఆదాయ వనరుల పెంపునకు కృషి చేస్తున్నట్లు వివరించారు. రాత్రి, పగలు గస్తీ నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయిస్తామని చెప్పారు. అపరాధ రుసుం వసూలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. యార్డులో అక్రమాలకు చోటు లేకుండా చేస్తామని, పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ నేతృత్వంలో మార్కెట్ యార్డు అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో మిర్చి దిగుమతి, ఎగుమతిదారుల అసోసియేషన్ల నాయకులు లేళ్ల పెద్ద అప్పిరెడ్డి, జుగిరాజ్ బండారి, కొత్తూరి సుధాకర్, యార్డు అధికారులు శ్రీకాంత్, సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment