ద్విచక్రవాహనంపైవస్తుండగా ఘటన
అక్కడికక్కడే కుమారుడు మృతి చికిత్స పొందుతూ తల్లి మృత్యువాత
బాపట్ల టౌన్ : ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు తల్లీకుమారుడిని బలిగొంది. ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో కుమారుడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన తల్లిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని మచ్చావారిపాలెం సమీపంలో చోటుచేసుకుంది.
వివరాలు.. పట్టణంలోని జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న పెర్ల శివయ్య (45) తన తల్లి చిట్టెమ్మను ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని బాపట్ల వైపు నుంచి జగనన్నకాలనీ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పెర్ల శివయ్య అక్కడికక్కడే మృతి చెందారు. తల్లి చిట్టెమ్మకు రెండు కాళ్లు విరిగిపోయాయి. స్థానికులు స్పందించి చికిత్స నిమిత్తం బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ చిట్టెమ్మ(70) మృతి చెందింది.
శివయ్యకు భార్య భవాని, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిట్టెమ్మకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. శివయ్య నాలుగో సంతానం. రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు ఒక్కసారే మృతి చెందడంలో ఏరియా వైద్యశాలలో కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. బాపట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.