
అర్జీల పరిష్కారంలో సమన్వయం ముఖ్యం
గుంటూరువెస్ట్: ప్రజల సమస్యలను మరింత వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత కాలంలోనే పరిష్కరించాలన్నారు. పరిష్కారానికి వీలుకానివి, కోర్డు కేసుల్లో ఉన్నవి అర్జీదారునికి వివరించి చెప్పాలని పేర్కొన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకుండా పరిష్కరించాలని తెలిపారు. తమ అర్జీలను ప్రజలు స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చన్నారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయన్నారు. ప్రజలు అందించే అర్జీలకు తప్పనిసరిగా ఎండార్స్‌మెంట్ ఇవ్వాలన్నారు. అనంతరం వచ్చిన 2235 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ