
బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం
సాక్షి, అమరావతి: గుంటూరు నగరంలో వీధి కుక్క దాడిలో మృతి చెందిన నాలుగేళ్ల బాలుడు కె ఐజక్ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశాలతో బాలుడి కుటుంబానికి సోమవారం పరిహారం అందించారు. బాలుడి కుటుంబానికి ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న వీధి కుక్కల సంతాన నియంత్రణ కోసం 4 నెలల్లో స్టెరిలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 3.43 లక్షల వీధి కుక్కలు ఉండగా, అందులో 2.03 లక్షల కుక్కలకు స్టెరిలైజేషన్ పూర్తయిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ముఖ్యమంత్రికి వివరించారు. వీధి కుక్కల సంఖ్య పెరగకుండా అదుపు చేసేందుకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీని తక్షణం చేపట్టాలని సీఎం సూచించారు. గుంటూరు తరహా ఘటనలు మళ్లీ తలెత్తకుండా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎక్స్‌గ్రేషియా చెక్కు అందజేత
నెహ్రూనగర్: వీధి కుక్క దాడిలో మృతి చెందిన బాలుడు ఐజాక్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెక్కును ఇన్‌ఛార్జ్ మేయర్ షేక్ సజీల అందజేశారు.. సోమవారం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు స్వర్ణభారతినగర్ శివారు ఇద్వా నగర్‌లో కుక్క దాడిలో మృతి చెందిన బాలుని తల్లిదండ్రులు రాణి, నాగరాజులను పరామర్శించి రూ.5 లక్షల చెక్కుని అందించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, కౌన్సిల్ టీడీపీ ఫ్లోర్‌లీడర్ కె.రవీంద్ర, స్థానిక కార్పొరేటర్ బి.స్మిత పద్మజ, ఎస్‌ఎస్ సోమశేఖర్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సాయి కల్యాణ చక్రవర్తి
గుంటూరు లీగల్: గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బి.సాయి కల్యాణ్‌చక్రవర్తి నియమితులయ్యారు. రాష్ట్రంలో వివిధ కోర్టుల్లో న్యాయమూర్తులుగా పనిచేస్తున్న కొందరికి పదోన్నతి, మరికొందరికి స్థాన చలనం కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న బి సాయి కళ్యాణ్ చక్రవర్తిని గుంటూరు జిల్లా ప్రధాని న్యాయమూర్తిగా నియమించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయుచున్న వై.వి.ఎస్.బి.జి.పార్థసారథిని హైకోర్టు రిజిస్టర్ జనరల్‌గా నియమించారు.
గుంటూరు నగరంలో పర్యటించిన ఐజీ
పట్నంబజారు: గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సోమవారం గుటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పాతగుంటూరు పోలీసు స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవల కాలంలో ఆనందపేటలో జరిగిన వృద్ధురాలు పఠాన్ ఖాజాబీ హత్య, ఆమె కుటుంబ సభ్యులపై జరిగిన దాడి నేపథ్యంలో సంబంధిత కేసు వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని, నిందితులను త్వరితగతిన అదుపులోకి తీసుకోవాలని స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. అనంతరం ఆనందపేట 2వలైనులో హత్య జరిగిన ప్రాంతాన్ని కూడా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పరిశీలించారు. ఐజీ వెంట ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ షేక్ అబ్దుల్ అజీజ్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్య, పాతగుంటూరు పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ వై.వీరసోమయ్య తదితరులు ఉన్నారు.
యార్డుకు 1,53,787 మిర్చి బస్తాలు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,53,787 బస్తాల మిర్చి రాగా గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,37,288 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల సగటు ధర రూ.9,500 నుంచి రూ.14,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల సగటు ధర రూ.10,000 నుంచి రూ.13,500 వరకు ధర లభించింది. తాలు రకం మిర్చికి రూ.4,500 నుంచి రూ.6,300 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యా ర్డులో ఇంకా 64,276 బస్తాలు నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు.

బాలుడి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం