
ఆర్వోబీ నిర్మాణం చేపట్టాలి
భవిష్యత్తు అవసరాల కోసమే
గుంటూరు ఎడ్యుకేషన్: శంకర్‌విలాస్ ఆర్వోబీ నిర్మాణాన్ని గుంటూరు ప్రజల అవసరాలతోపాటు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాలని బెటర్ శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ సాధన జేఏసీ నాయకుడు ఎల్‌ఎస్ భారవి డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని శంకర్‌విలాస్ కూడలిలో ఫ్‌లై ఓవర్ సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం ప్రభుత్వం నిర్మించనున్న ఆర్వోబీ ద్వారా వచ్చే ఇబ్బందులపై ప్రజలను చైతన్యపరిచే పోస్టర్లు ఆవిష్కరించారు. భారవి మాట్లాడుతూ హిందూ కళాశాల నుంచి లాడ్జి సెంటర్ వరకు ఐకానిక్ ఫ్లైఓవర్ బ్రిడ్జిగా నిర్మాణం చేయబోతున్నట్లు చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు మాట తప్పారని అన్నారు. అరండల్‌పేట 8,9 లైన్లు నుంచి ఏసీ కళాశాల వరకు 930 మీటర్లు నిర్మాణాన్ని చేపడుతూ, ఆర్‌యూబీ సైతం ప్రస్తుతానికి సాధ్యం కాదని స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రకటించటం ద్వారా ట్రాఫిక్ కష్టాలు తీరకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల కిందట అప్పటి పాలకులు మెగా ఫ్లై ఓవర్ ప్రతిపాదించగా 2017లో టీడీపీ ప్రభుత్వంలోనే అప్పటి ఎంపీ గల్లా జయదేవ్, రోడ్డు భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు శంకర్ విలాస్ బ్రిడ్జిని స్వయంగా పరిశీలించి, రూ.167 కోట్లతో ఆర్‌ఓబీ నిర్మాణం చేపట్టబోతున్నట్లు ప్రకటించారని తెలిపారు. ముందుగా ట్రాఫిక్ ఇబ్బందులేకుండా ఆర్‌యూబీని నిర్మిస్తామని చెప్పారు. ఆర్‌యూబీ లేకుండా ఆర్వోబీని నిర్మించటం చారిత్రక తప్పిదమే కాక, ప్రజలను తీవ్ర ఇక్కట్ల పాలు చేస్తుందని హెచ్చరించారు. ఇటీవల డొంకరోడ్డులోని మూడు వంతెనల వద్ద మూడో ట్రాక్ నిర్మాణం పేరుతో మూడు నెలలపాటు ట్రాఫిక్‌తో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. నగర ప్రజల ట్రాఫిక్ అవసరాలను 90 శాతం తీరుస్తున్న శంకర్ విలాస్ ఆర్వోబీని నిర్మాణం పేరుతో రెండేళ్లు ఆపివేస్తే ప్రజల కష్టాలు ఏవిధంగా ఉంటాయో ఊహించలేమన్నారు. రూ.98 కోట్లతో పూర్తి చేయాలని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం నుంచి వస్తున్న వాదన సరైనది కాదన్నారు. దీనిపై మంత్రులు, సీఎం దృష్టి సారించి తగినన్ని నిధులు కేటాయించి బహుళ ప్రయోజనకరమైన హిందూ కళాశాల కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు నిర్మించేలా ప్రజావాణిని తాము వినిపిస్తున్నామని అన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు యేల్చూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్వోబీ సమస్య కేవలం వ్యాపారస్తులకు సంబంధించిందే కాదని లక్షలాది మంది ప్రజలకు సంబంధించినది అని అన్నారు. భావి తరాల ప్రయోజనాలను గుర్తించి రైల్వే శ్వేత బంధం ప్రాజెక్టు నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరికొంత నిధులు విడుదల చేసి హిందూ కళాశాల నుంచి లాడ్జి సెంటర్ వరకు నిర్మాణం చేపట్టాలని కోరారు. గురువారం ఉదయం లాడ్జి సెంటర్ నుంచి హిందూ కళాశాల వరకు పెద్ద ఎత్తున మానవహారంతో నిరసన తెలియచేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రేట్ పేయిర్స్ అసోసియేషన్ నాయకులు వల్లూరి సదాశివరావు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి జి.వెంకటరావు, ఆటో యూనియన్ జేఏసీ నాయకులు మస్తాన్‌వలీ, ఎల్‌ఐసి నాయకులు రాజేశ్వరరావు, అరండల్‌పేట, బ్రాడీపేట వ్యాపారస్తుల జేఏసీ నాయకులు కమలకాంత్, సాంబశివరావు, మహిళా జేఏసీ నాయకురాలు కల్యాణి, వివిధ పౌర సంఘాల, స్వచ్ఛంద సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ప్రకటించినట్లు పొడవు తగ్గించరాదు
రేపు నగరంలో మానవహారం