నేడు 144 సెక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు 144 సెక్షన్‌

Published Sun, Jun 16 2024 1:20 AM | Last Updated on Sun, Jun 16 2024 1:20 AM

నేడు

వరంగల్‌ క్రైం : సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష సజావుగా నిర్వహించేందుకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆదివారం 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు కమిషనరేట్‌ ఇన్‌చార్జ్‌ సీపీ అభిషేక్‌ మొహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 5గంటల వరకు సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

18న జెడ్పీ స్థాయీ

సంఘాల సమావేశం

హన్మకొండ: వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాన్ని ఈనెల 18న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ విద్యలత తెలిపారు. హనుమకొండలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2, 3, 5, 6వ స్థాయీ సంఘాల సమావేశం ఉదయం 10.30 గంటలకు, 4వ స్థాయీ సంఘం సమావేశంలో 11.30 గంటలకు, 7వ స్థాయీ సంఘం సమావేశంలో మధ్యాహ్నం 12 గంటలకు, 1వ స్థాయి సంఘం సమావేశం మధ్యాహ్నం 1 గంటలకు జరుగుతుందని తెలిపారు. సభ్యులు, అధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

జాతీయ నృత్యపోటీల్లో

శ్లోకకు ప్రథమ స్థానం

కాజీపేట రూరల్‌: కాజీపేటకు చెందిన చిన్నారి శ్లోక ఇటీవల ఒడిశా పూరి జగన్నాథ ఆలయంలో కథక్‌ రాకర్స్‌ ఆర్గనైజేషన్‌ వారి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి డాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ తరాంగన్‌–24 పోటీలో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్‌ లోకో షెడ్‌ సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎ.కమలాకర్‌ కూతురు శ్లోక ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ఆమె పాల్గొని భరత నాట్యవిభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అదేవిధంగా విద్యార్థిని సమీక్ష కూడా పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచింది. వీరు ప్రముఖుల చేతుల మీదుగా అవార్డు, సర్టిఫికెట్స్‌ అందుకున్నారు. శ్లోక, సమీక్షను శ్రీ శివసాయి నృత్య అకాడమీ గురువు దేవులపల్లి దివ్య, రైల్వే అధికారులు అభినందించారు.

‘కుడా’ వైస్‌ చైర్‌పర్సన్‌

బాధ్యతల స్వీకరణ

నయీంనగర్‌: ‘కుడా’ వైస్‌ చైర్‌పర్సన్‌గా అశ్విని తానాజీ వాకడే శనివారం ‘కుడా’ కార్యాలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఉన్నతాధికారులు సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు, సెక్రటరీ మురళీధర్‌రావు, సత్యనారాయణ వైస్‌ చైర్‌పర్సన్‌కు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అశ్విని తానాజీ వాకడే జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. ‘కుడా’ వైస్‌ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు.

ఆర్టీసీ ఆర్‌ఎంగా

విజయభాను

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌గా హైదరాబాద్‌ చార్మినార్‌ డివిజన్‌ డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ (ఆపరేషన్‌)గా పనిచేస్తున్న డి.విజయభాను నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆర్‌ఎంగా ఉన్న జాస్తి శ్రీలతను రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌గా బదిలీ చేస్తూ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీలత 2022, నవంబర్‌ 18న వరంగల్‌ ఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించారు. దాదాపు ఏడాదిన్నరపాటు పనిచేశారు.

18న జాబ్‌మేళా

కాళోజీ సెంటర్‌: వరంగల్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతీయువకులకు ఈనెల 18న ములుగు రోడ్డు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్‌.మాధవి ఒక ప్రకటలో తెలిపారు. హైదరాబాద్‌లోని కృషి విజ్ఞాన్‌ ఫర్టిలైజర్స్‌లో 67 ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, అగ్రికల్చరల్‌, మార్కెటింగ్‌ అర్హతతోపాటు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న అభ్యర్థులు అర్హులని తెలిపారు. విద్యార్హతల సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌ కాపీలతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని, వివరాలకు 9963177056 , 9177097456 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేడు 144 సెక్షన్‌1
1/1

నేడు 144 సెక్షన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement