
కుమారుడి కళ్లెదుటే కనిపించని లోకాలకు..
బైక్‌ను ఢీకొన్న లారీ..
తల్లిదండ్రులు దుర్మరణం
● గుండెలవిసేలా రోదించిన
కుటుంబీకులు..
● మల్లంపల్లిలో ఘటన
ములుగు : కుమారుడి కళ్లెదుటే తల్లిదండ్రులు దుర్మరణం చెందారు. బైక్‌పై తల్లిదండ్రులు ముందు వెళ్తున్నారు. కుమారుడు వారికి కొద్ది దూరంలో వెనుక నుంచి మరో బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఓ లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ దృశ్యాన్ని చూసిన కుమారుడు గుండెలవిసేలా రోదించాడు. ఇక తనకు దిక్కెవరంటూ తల్లిదండ్రుల మృతదేహాలపై పడి బోరున విలపించాడు. ఈ ఘటన గురువారం ములుగు జిల్లా మల్లంపల్లిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన దంపతులు షేక్ మహమూద్(58), షేక్ సైనా(45)తమ కుమారుడు షబ్బీర్‌తో కలిసి రెండు బైక్‌లపై పని నిమిత్తం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి శివరాత్రి సందర్భంగా రామప్ప వెళ్లారు. అనంతరం స్వగ్రామం బుధరావుపేటకు వస్తున్నారు. మల్లంపల్లి నుంచి వెళ్తున్న క్రమంలో మల్లంపల్లి– నర్సంపేట జాతీయ రహదారిపై నర్సంపేట వైపు నుంచి వస్తున్న లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో షేక్ మహమూద్, షేక్ సైనా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్సై ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి బావమరిది గఫూర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్వరావు తెలిపా రు. కాగా, తన కల్లెదుటే తల్లిదండ్రులు దుర్మరణం చెందడంతో కుమారుడు షబ్బీర్ కన్నీరుమున్నీరుగా రోదించాడు.
గంటలో ఇంటికి చేరేవారు..
ఖానాపురం: రెక్కాడితే కానీ డొక్క నిండని కుటుంబం. ఇతర ప్రాంతాలకు వెళ్లి వ్యాపారం చేసుకునే ఆ కుటుంబంలో పెనువిషాదం చోటుచేసుకుంది. మరో గంటలో ఇంటికి చేరుకోవాల్సిన తరుణంలో మృత్యువు కబలించింది. వ్యాపారం పూర్తయిన అనంతరం ఇంటిబాట పట్టిన దంపతులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబం బోరున విలపించింది.. ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన షేక్ మహమూద్, షేక్ సైనా దంపతులు రెడీమేడ్ దుస్తుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జీవనోపాధి నిమిత్తం నెల రోజుల క్రితం ఆసిఫాబాద్‌కు వెళ్లారు. అక్కడి నుంచి శివరాత్రి సందర్భంగా రామప్ప వెళ్లారు. వ్యాపారం ముగిసిన అనంతరం బైక్‌పై మల్లంపల్లికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేసి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో ములుగు జిల్లా మల్లంపల్లి మండల శివారులోని నర్సంపేట జాతీయ రహదారిపై లారీ.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో మహమూద్ లారీ చక్రాల కింద నలిగిపోగా రోడ్డు పక్కన సైనా విగత జీవిలా పడింది. ఈ దంపతులకు నలుగురు సంతానం. కుమారుడు, కుమార్తెకు వివాహం కాగా మరో కుమార్తె, కుమారుడికి కావాల్సి ఉంది. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో రోదిస్తున్న తీరు పలువురిచేత కన్నీరు పెట్టించింది.

కుమారుడి కళ్లెదుటే కనిపించని లోకాలకు..
Comments
Please login to add a commentAdd a comment