
చెట్టును ఢీకొన్న కారు.. ఒకరి దుర్మరణం
మంగపేట: కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో మంగపేట మండల కేంద్రానికి చెందిన కిరాణా వ్యాపారి బొల్లా ప్రసాద్(44) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురువారం తెల్ల వారుజామున తాడ్వాయి మండల పరిధిలో జరిగింది. తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కథనం ప్రకారం.. ప్రసాద్ తన మిత్రులతో కలిసి జిల్లాలోని వెంకటాపురం(ఎం) మండలం పాలంపేటలోని రామప్ప ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు బుధవారం రాత్రి కారులో వెళ్లారు. దైవదర్శనం అనంతరం ఇంటికి వస్తున్న క్రమంలో తాడ్వాయి మండల పరిధిలోని జలగలంచ తోగు గుంపుల మధ్య అడవి జంతువు అడ్డుగా రావడంతో దానిని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారు నడుపుతున్న ప్రసాద్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కారులో అతడి తోపాటు ఉన్న మంగపేటకు చెందిన బట్టలషాపు యజమాని శిద్ధశెట్టి శ్రీనివాస్, టీజీ ఎన్పీడీసీఎల్ మంగపేట ఏఈ రామసుబ్బరాయశర్మ, గుర్రం వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకుని ప్రసాద్ మృతదేహంతోపాటు క్షతగాత్రులను 108లో ఏటూరునాగారం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి తమ్ముడు బొల్లా సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment