రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత

Published Fri, Nov 22 2024 7:35 AM | Last Updated on Fri, Nov 22 2024 7:35 AM

రూ.22

రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత

ముగ్గురు వ్యక్తుల అరెస్ట్‌

సుల్తాన్‌బజార్‌: అక్రమంగా తరలిస్తున్న రూ.22 లక్షల హవాలా నగదును స్వాధీనం చేసుకున్న సుల్తాన్‌బజార్‌ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోఠి గుజరాతి గల్లీలో ముగ్గురు వ్యక్తులు రూ.22 లక్షల నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆర్‌కే.కాంప్లెక్స్‌ వద్ద మాటు వేసిన పోలీసులు యాక్టివాపై నగదు తీసుకెళుతున్న మొగల్‌పురాకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ ఖయ్యూమ్‌, గుజరాతీ గల్లీకి చెందిన ఉత్తమ్‌కుమార్‌, హనుమాన్‌టేక్డీకి చెందిన లలిత్‌సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబందించి ఆధారాలు లేకపోవడంతో సీజ్‌ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహిళా న్యూస్‌రీడర్‌కు వేధింపులు

నిందితుడిపై కేసు నమోదు

బంజారాహిల్స్‌: తనను వెంటాడి వేధింపులకు గురిచేస్తున్నాడని, తన ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మహిళా న్యూస్‌ రీడర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు ఓ యువకుడిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ టీవీ చానల్‌లో న్యూస్‌ రీడర్‌గా పనిచేస్తున్న యువతికి ఐదేళ్ల క్రితం హరీష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఏడాది క్రితం హరీష్‌ మరో యువతిని వివాహం చేసుకోవడంతో బాధితురాలు అతడితో మాట్లాడటం ఆపేసింది. అయితే హరీష్‌ కొంతకాలంగా ఆమెను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, తన సహోద్యోగుల ఎదుట దుర్బాషలాడుతూ తన ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాడంటూ బాధితురాలు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం తన కార్యాలయానికి వచ్చిన హరీష్‌ కిందికి వెళ్లి మాట్లాడుకుందామంటూ బలవంతంగా బయటికి తీసుకువచ్చి లిఫ్ట్‌లో ఎక్కిన తర్వాత కొట్టడమే కాకుండా కారు రెడీగా ఉంచండి..అంటూ తన స్నేహితులకు చెప్పాడన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిందితుడు తన వెంట పడుతున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని, ఫోన్‌ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు హరీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బైక్‌ అదుపు తప్పి యువకుడి మృతి

దుండిగల్‌: బైక్‌ అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వరంగల్‌ జిల్లా, సముద్రాల గ్రామానికి చెందిన దేవేందర్‌రెడ్డి– శ్రీలత దంపతులు నగరానికి వలస వచ్చి డి.పోచంపల్లి సారెగూడెంలో నివాసమంటున్నారు. వారి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి(23) మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి అతను విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా స్థానిక డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సమీపంలోని సర్వీస్‌ రోడ్డులో బైక్‌ అదుపు తప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సూరారంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి దారుణ హత్య

సంతోష్‌నగర్‌: పాత గొడవల కారణంగా ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సంతోష్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ కె.సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి ఓవైసీ కాలనీ ఫజల్‌ కేఫ్‌ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు సంతోష్‌నగర్‌ ఎంబీ హట్స్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సాబేర్‌ ఖాన్‌ కుమారుడు మహ్మద్‌ మోహిత్‌ ఖాన్‌ (18)పై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఓవైసీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత గొడవల కారణంగానే ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంతోష్‌నగర్‌ ఏసీపీ మహ్మద్‌ గౌస్‌, సంతోష్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నకిలీ ఆర్టీఓ ఆటకట్టు

ఉప్పల్‌: ఉప్పల్‌ పోలీసులు నకిలీ ఆర్టీఓ ఆట కట్టించారు. కారులో తిరుగుతూ సెంట్రింగ్‌ మిల్లర్లను భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్‌ హనుమసాయినగర్‌ ప్రాంతానికి చెందిన ప్రేమ్‌ కుమార్‌ రెడ్డి స్థానికంగా కట్టెల మిషన్‌ నడుపుతున్నాడు. నాలుగు నెలలుగా అతను ప్రతి రోజు తెల్లవారుజామున ఆర్టీఓ అవతారం ఎత్తేవాడు. కారులో తిరుగుతూ రోడ్డుపై వెళుతున్న సెంట్రింగ్‌ మిల్లర్లను అడ్డగించి తాను ఆర్టీఓనని కాగితాలు చూపించాలంటూ, బండి ఓవర్‌ లోడ్‌ ఉందంటూ పలు రకాలు బెదిరించి అందిన కాడికి వసూలు చేస్తున్నాడు. ఉప్పల్‌, బోడుప్పల్‌, చంగిచర్ల, మేడిపల్లి, నాగోల్‌ తదితర ప్రాంతాల్లో మాటు వేసి వసూళ్ల దందాకు తెరలేపాడు. ఒకసారి తానే ఆర్టీఓను అంటూ..మరోసారి సార్‌ కారులో ఉన్నాడంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. అతడి వైఖరిపై అనుమానం వచ్చిన సెంట్రింగ్‌ మిల్లర్ల యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఘా ఉంచిన ఉప్పల్‌ పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. బ్రెజా కారు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఆర్టీఓను అరెస్టు చేసినట్లు సమాచారం అందడంతో బాధితులు పెద్ద సంఖ్యలో ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలి వచ్చారు. గతంలో ఆర్టీఓ అధికారులు తనకు చలానా వేసి వేధించడంతోనే తానూ రంగంలోకి దిగినట్లు నిందితుడు పేర్కొనడం గమనార్హం.

భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

ఫిలింనగర్‌: నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బీహార్‌కు చెందిన మహ్మద్‌ తయీమ్‌మియా (36) రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి షేక్‌పేట బృందావన్‌ కాలనీలో తన గ్రామానికే చెందిన మహ్మద్‌ ఖయూమ్‌ మియా వద్ద ఉంటున్నాడు. గురువారం అతను ఎస్‌ఏ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో ముఖేష్‌ అనే వ్యక్తితో కలిసి ఐదో అంతస్తులో రూఫ్‌ వర్క్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరూ జారి లిఫ్ట్‌ గుంతలో పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని అత్తాపూర్‌లోని జర్మెంటైన్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తయీమ్‌మియా మృతి చెందాడు. ముఖేష్‌ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడి సోదరుడు ఖయూమ్‌మియా ఫిర్యాదు మేరకు పోలీసులు బిల్డర్‌, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కారులో తిరుగుతూ దందాలు

నాలుగు నెలలుగా సెంట్రింగ్‌ మిల్లర్లను బెదిరించి వసూళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత 
1
1/3

రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత

రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత 
2
2/3

రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత

రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత 
3
3/3

రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement