ప్రముఖులకు గగనతల
సాక్షి, సిటీబ్యూరో: ముష్కరమూకలు తెలివి మీరుతున్నాయి.. ఓ పక్క ఉగ్రవాదులు, మరోపక్క తీవ్రవాదులు గగనతల దాడులకు కుట్రలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారాగ్‌లైడర్లు, డ్రోన్లతో పాటు అనధికారికంగా వినియోగించే అన్ని రకాలైన ఎగిరే వస్తువులపై నిషేధం విధించాల్సిందిగా కేంద్ర నిఘా వర్గాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ హెచ్చరిక వెనుక అనేక కారణాలున్నాయి. దేశ వ్యాప్తంగా పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాదుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలపై నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి. ఈ నేపథ్యంలో ముష్కర సంస్థల గగనతల దాడుల వ్యూహం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా ఎంపిక చేసిన క్యాడర్‌కు గగనతల దాడుల్లో శిక్షణ ఇస్తున్నట్లు వీరు వెల్లడించారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకి చెందిన ఓ వింగ్ ఈ ఉగ్రవాదులకు పారాచూట్ జంపింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని ఉగ్రవాద సంస్థలు చైనా, యూఏఈకి చెందిన కంపెనీల నుంచి పారాగ్‌లైడర్ల తయారీకి ఉపకరించే ఉపకరణాలు, పాకిస్థాన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి డ్రోన్లు ఖరీదు చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీటికి తోడు గతంలో స్పెయిన్‌లో జరిగిన గగనతల పరికరాలు, ఉపకరణాల కొనుగోళ్లకు సంబంధించి నిఘా వర్గాలు సేకరించిన ఆధారాలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు 10 లక్షల పాక్ రూపీలను వెచ్చించి స్పెయిన్‌లో పారాగ్‌లైడర్ ఉపకరణాలను ఖరీదు చేసినట్లు నిఘా వర్గాలకు ఆధారాలు లభించాయి. వీటిలో ఇద్దరు ప్రయాణించే సౌకర్యం ఉందని, ఇవి దాదాపు 150 కేజీల బరువును 70 కిమీ మేర నిర్విరామంగా మోసుకుపోయే సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించాయి. వీరు ఈ ఉపకరణాలను వివిధ మార్గాల్లో భారత్‌కు తరలించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. వీటిని వినియోగించి టార్గెట్లపై గగనతల దాడులు చేయడంతో పాటు పేలుడు పదార్థాలు, ఆయుధాల రవాణాకూ వినియోగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అనధికారిక పారాగ్‌లైడర్లు, డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా పని చేసే తేలికపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లు, చిన్న పరిమాణం కలిగిన మానవరహిత విమానాలను పూర్తి స్థాయిలో నిషేధించాలని, అనుమతి ఉన్న వాటినీ సాధ్యమైనంత వరకు నియంత్రించాలని అన్ని రాష్ట్రాలనూ హెచ్చరించాయి. మరోపక్క మావోయిస్టులు మినీ హెలీకాఫ్టర్ల తయారీపై దృష్టి పెట్టినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్‌గడ్, బీహార్, కేరళలో జరిగిన ఆపరేషన్ల సందర్భంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తక్కువ బరువు, సామర్థ్యం కలిగినవి రూపొందించి వినియోగించడానికి మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడైంది. వీటికి సంబంధించిన ఓ డిజైన్ బీహార్‌లోని గయ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులకు లభించింది. ఇప్పటి వరకు విధ్వంసాల కోసం మావోయిస్టులు ఎక్కువగా మందుపాతరలనే ప్రయోగిస్తున్నారు. వీటికి భిన్నంగా రిమోట్ కంట్రోల్ బాంబుల తయారీకీ ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వీటినీ గగనతలం ద్వారా వినియోగించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
నేటి సాయంత్రం వరకు అత్యంత అప్రమత్తం...
రాజధానిలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కొత్వాల్ సీవీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఐఎస్‌ఐ డివిజన్ బుధవారం నగర పోలీసులకు ఓ వర్తమానం పంపింది. రాష్ట్ర సచివాలయానికి మూడు కిలోమీటర్ల పరిధిలో, సున్నిత విభాగాలకు కార్యాలయాలకు 2 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్‌లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌స్ ఎగరడంపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది. వీటిని పరిగణలోకి తీసుకున్న సీపీ గగనతలంలో ఎగిరే వాటిపై నిషేధం విధించారు. శుక్రవారం సాయంత్రం వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫొటోలు, వీడియోల చిత్రీకరణ కోసమూ వీటిని వాడకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకు గగనతలంపైనా పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నిఘా హెచ్చరికలు
నగరంలో డ్రోన్లు, పారాగ్లైడర్ల
సంచారంపై నిషేధం
పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
Comments
Please login to add a commentAdd a comment