డ్రైనేజీ సమస్యలపై నివేదికలివ్వండి
● సమస్య పరిష్కారం కోసం నిధులు ఇస్తాం
● పరిసరాల్లో చెత్త, చెదారం, పిచ్చి మొక్కలు తొలగించాలి
● హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలు
సాక్షి,సిటీబ్యూరో: డ్రైనేజీల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. డీఈవో, డిప్యూటీ ఈఓ, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్, ఈఈ ఐడీసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్, తహసీల్దార్లు పాఠశాలలను తనిఖీ చేసి చేపట్టాల్సిన పనులపై శుక్రవారం సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని సూచించారు. గురువారం ఆయన పాతబస్తీలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల అసంపూర్తి పనులను పూర్తిచేయాలని, అందుకు అవసరమైన నిధులపై ప్రతిపాదనలు అందజేయాలన్నారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలన్నారు. బహుద్దూర్‌పూర లోని దారుల్ షిఫా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాఠశాల ఆవరణలో మురికి నీరు నిల్వ ఉండకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ నీళ్లు పాఠశాలలోకి రాకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు అనంతరం అంధుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట డీఈవో రోహిణి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment