రైల్వే సీరియల్ కిల్లర్’రాహుల్ జాట్ వ్యవహార శైలి
హత్య తర్వాత మృతదేహంపక్కన గడిపే సైకోయిజం
కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న వల్సాద్ పోలీసులు
ఆ తర్వాతే నగరానికి తరలించేందుకు అవకాశం
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రమణమ్మ సహా ఐదుగురిని హత్య చేసిన ‘రైల్వే సీరియల్ కిల్లర్’ రాహుల్ జాట్ విచారణలో గుజరాత్ అధికారులు కీలక విషయాలు గుర్తిస్తున్నారు. సోమవారం అతడిని అరెస్టు చేసిన వల్సాద్ పోలీసులు న్యాయస్థానం అనుమతితో బుధవారం తమ కస్టడీకి తీసుకున్నారు. వచ్చే నెల 5 వరకు జరిగే వారి విచారణ పూర్తయిన తర్వాతే రమణమ్మ హత్య కేసులో సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నరహంతకుడు కేవలం 35 రోజుల్లో పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో ఐదుగురిని హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే.
శవాన్నీ వదలడు...
రాహుల్ జాట్‌ను వల్సాద్ పోలీసులు ఈ నెల 14న జరిగిన 19 ఏళ్ల బీకాం విద్యార్థిని హత్య కేసులో సోమవారం పట్టుకున్నారు. విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీ–కన్‌స్ట్రక్షన్ కోసం బుధవారం ఘటనాస్థలికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే అతడి వ్యవహారశైలికి సంబంధించిన కీలకాంశాలను గుర్తించారు. ఫోన్ మాట్లాడుకుంటూ ఉద్వాడ రైల్వే ప్లాట్‌ఫామ్‌పై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని బలవంతంగా సమీపంలోని మామిడి తోటలోకి లాక్కెళ్లిన రాహూల్ అత్యాచారం చేసి, గొంతు నులిమి హత్య చేసిన అక్కడి నుంచి వెళ్లిపోయాడని వల్సాద్ పోలీసులు గుర్తించారు. కొద్దిసేపటికి మళ్లీ మామిడి తోటలోకి వచ్చిన అతను విద్యార్థిని మృతదేహంపై మరోసారి అత్యాచారానికి ఒడిగట్టాడని దర్యాప్తులో తేల్చారు.
ఫ్రూట్ సలాడ్ తిని, ఎనిమిది కి.మీ నడిచి...
ఆపై మృతదేహానికి సమీపంలోని పొదల్లో దాక్కున్న రాహుల్.. అప్పటికే తనతో తెచ్చుకున్న ఫ్రూట్ సలాడ్ తింటూ గడిపాడు. విద్యార్థినిని వెతుక్కుంటూ వచ్చిన ఆమె కుటుంబీకులు, స్నేహితులు వచ్చే వరకు అలానే నక్కి ఉన్నాడు. వారి ఆర్తనాదాలు వింటూ, మృతదేహాన్ని తరలించే వరకు ఆగి ఆ తర్వాత రైలు పట్టాల వెంట నడుస్తూ వెళ్లి పోయాడు. అక్కడికి దాదాపు ఎనిమిది కిమీ దూరంలో ఉన్న పర్దీ రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కి వడోదర వెళ్లిపోయినట్లు వల్సాద్ పోలీసులు తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినా తనకు సంబంధించిన ఏ చిన్న క్లూ దొరక్కూడదనే ఇలా వ్యవహరించాడని అధికారులు చెబుతున్నారు. నేరచరిత్ర ఉన్న రాహుల్‌కు పోలీసులు దర్యాప్తు విధానాలు తెలిసి ఉండటంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరిస్తున్నారు.
మృతదేహం పక్కన పడుకుంటాడు...
సైకో సీరియల్ కిల్లర్ రాహుల్‌కు మరో విచిత్రమైన లక్షణం కూడా ఉన్నట్లు వల్సాద్ పోలీసులు పేర్కొన్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహం పక్కనే కాసేపు పడుకునేవాడని తెలిపారు. ఈ లక్షణాల నేపథ్యంలోనే అతడు సైకో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రమణమ్మ సహా ఐదుగురిని రాహుల్ రైళ్లు, రైల్వే స్టేషన్లలో చంపినట్లు ఇప్పటి వరకు తేలింది. ఈ మృతదేహాలతోనూ ఇలానే ప్రవర్తించాడని వల్సాద్ అధికారులు వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గడిచిన రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రైళ్లు, రైల్వేస్టేషన్లలో జరిగిన హత్యలు, లభించిన గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులనూ వల్సాద్ పోలీసులు సేకరిస్తున్నారు. వీటిని క్రోడీకరించడం ద్వారా రాహుల్ ప్రమేయాన్ని నిర్ధారించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment