సారంగాపూర్: మండలంలోని కోనాపూర్, పెంబట్ల సింగిల్ విండో చైర్మన్ గుర్నాథం మల్లారెడ్డిపై సంఘం సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానం గురువారం వీగిపోయింది. దీంతో సంఘం అధ్యక్షుడిగా మల్లారెడ్డి కొనసాగనున్నారు. మల్లారెడ్డి సంఘం ఆర్థిక లావాదేవీలను సభ్యుల ముందు ఉంచడం లేదని, సేవింగ్ ఖాతా నుంచి సభ్యుల అనుమతి లేకుండా పెద్దమొత్తంలో డ్రా చేశారని, భవన నిర్మాణంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, డైరెక్టర్లకు సమాచారం లేదని పేర్కొంటూ గతనెల 16న అవిశ్వాసానికి అనుమతించాలని జిల్లా సహకార అధికారికి సభ్యులు ఫిర్యాదు చేశారు. సంఘం ఉపాధ్యక్షురాలు జి.మంగమ్మ, మరో ఎనిమిది మంది డైరెక్టర్లు అవిశ్వాసానికి ప్రతిపాదించారు. అవిశ్వాసంపై చర్చించేందుకు సంఘం భవనంలో జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ అధ్యక్షతన సభ్యుల సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 13 మంది డైరెక్టర్లకు తప్పనిసరిగా 9 మంది డైరెక్టర్లు హాజరుకావాల్సి ఉండగా.. ఏడుగురే హాజరుకావడంతో అవిశ్వాసం వీగిపోయినట్లు జిల్లా సహకార అధికారి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment