విద్యావ్యవస్థ గాడిన పడేనా..?
ప్రణాళికతో ముందుకెళ్తాం
విద్యార్థులకు పకడ్బందీగా విద్యనందించేలా చర్యలు చేపడతాం. ప్రతీ స్కూల్‌ను తనిఖీ చేయడంతో పాటు, విద్యార్థులకు విద్య ఎలా అందుతుందని పరిశీలిస్తాం. ప్రణాళిక ప్రకారం పదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తి చేసి మళ్లీ రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిపేలా చూస్తాం.
– రాము, డీఈవో
జగిత్యాల: జిల్లాలో విద్యా వ్యవస్థ గాడినపడేనా అన్న సంశయం వ్యక్తమవుతోంది. కరోనా అనంతరం విద్యావ్యవస్థ గాడితప్పింది. జగిత్యాల జిల్లాగా ఏర్పడిన అనంతరం రాష్ట్రంలో పదో తరగతి ఫలితాల్లో మూడుసార్లు హ్యాట్రిక్ సాధించింది. అనంతరం ఫలితాలు దిగజారిపోతున్నాయి. గతంలో వలె ప్రస్తుతం విద్యార్థులకు మెరుగైన విద్య అందించకపోవడం వల్లె ఫలితాల్లో వెనుకబడిపోతున్నారనే ఆరోపణలున్నాయి.
అవినీతి ఆరోపణల వెల్లువ
విద్యాశాఖలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ ఉపాధ్యాయుడు ఓ ఉపాధ్యాయురాలిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడనేని ఫిర్యాదుతో అతడిని సస్పెండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఓ విద్యార్థినికి ఫోన్‌లో అశ్లీల చిత్రీలు చూపిస్తున్నాడని ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఇలా జిల్లాలో పలు ఘటనలు జరిగాయి. అలాగే అమ్యామ్యాలు ముడితేనే ప్రైవేటు స్కూల్స్‌కు సంబంధించి రెన్యువల్ చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే గతంలో అధికారులు ఒక్కో పాఠశాల రెన్యువల్‌కు సంబంధించి మాముళ్లు పుచ్చుకుని కొన్ని స్కూళ్లకు ఐదేళ్లు, మరికొన్నింటికి పదేళ్ల వరకు రెన్యువల్ చేసినట్లు తెలిసింది.
సిలబస్ పూర్తయ్యేనా
మరో మూడునెలల్లో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 31లోపు సిలబస్ పూర్తి కావాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇప్పటికీ 70 శాతం పూర్తికాలేదు. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉపాధ్యాయులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, గతంలో బదిలీల్లో అవకతవకలు జరిగాయనే విమర్శలున్నాయి. గతంలో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ ఏర్పాటు చేయగా అది ఎత్తి వేశారు. దీంతో ఉపాధ్యాయులు స్కూళ్లకు ఎప్పుడు వస్తారో, వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది.
బడుల్లో ఉపాధ్యాయుల ఫొటోలు..
బడుల్లో బినామీ టీచర్లు లేకుండా ప్రతీ తరగతి గదిలో ఉపాధ్యాయుల ఫొటోలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొన్ని చోట్ల ఉపాధ్యాయులున్నా మరొకరిని పెట్టి బోధన చేయిస్తున్నారు. ఇలాంటివి మున్ముందు జరగకుండా తనిఖీ ల్లో బయటపడే అవకాశాలుంటాయి. ప్రస్తుతం మండలానికొక ఎంఈవోను నియమించారు. ప్రతీ పాఠశాలను నిత్యం పర్యవేక్షించి ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు పూర్తిస్థాయిలో చదువు అందించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
వ్యాపారాలపై మక్కువ
జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు వ్యాపారాలపైనే మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చాలా మంది చిట్టీల వ్యాపారం చేశారు. అంతేకాక రియల్‌ఎస్టేట్‌లో సైతం కొనసాగుతున్నట్లు, తాజాగా యుబిట్‌లో బిజినెస్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాష్ట్రంలోనే సంచలనంగా మారిన ఈ బిజినెస్ జగిత్యాలలో రూ.కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ఇందులో ఉపాధ్యాయులు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఇలాంటి బిజినెస్‌లు చేయడంతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికై నా కొత్తగా వచ్చిన డీఈవో ప్రత్యేక దృష్టి సారించి పదో తరగతి ఫలితాల్లో మళ్లీ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచేలా చర్యలు తీసుకో వాల్సిన బాధ్యత ఉంది.
కొత్త డీఈవోకు సవాళ్లు
ఫలితాల్లో ప్రథమస్థానంలో నిలిచేనా..
శాఖలో అవినీతి ఆరోపణల వెల్లువ
Comments
Please login to add a commentAdd a comment