విలీనం.. వివాదం
మెట్‌పల్లి/మెట్‌పల్లిరూరల్: మండలంలోని వెల్లుల్ల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఎల్లమ్మ ఆలయం విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసింది. గ్రామాభివృద్ధి కమిటీ నిర్వాహణలో ఉన్న ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ(ఎండోమెంట్) పరిధిలో చేర్చుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని వీడీసీతో పాటు గ్రామ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంటుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది.
ఆది నుంచీ వీడీసీ పర్యవేక్షణలోనే..
● గ్రామ శివారులోని ఎల్లమ్మ ఆలయ వ్యవహారాలను మొదటి నుంచి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తూ వస్తున్నారు.
● ప్రతీ మంగళవారం ఆలయం వద్ద జాతర జరుగుతోంది. దీనికి ఇతర జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా వందలాది మంది భక్తులు తరలివస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా వీడీసీ పలు వసతులు ఏర్పాటు చేసింది.
● జాతర రోజున భక్తుల నుంచి కోడి మొక్కుకు రూ.30, మేక తదితర వాటికరి రూ.100 వసూలు చేస్తున్నారు. దీంతో పాటు హుండీ ద్వారా కూడా ఆదాయం సమకూరుతోంది. ఈ మొత్తాలను సౌకర్యాల కల్పనకు వినియోగిస్తున్నట్లు వీడీసీ సభ్యులు చెబుతున్నారు.
అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు
● ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని ఖర్చు చేసే విషయంలో వీడీసీ సభ్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని కొద్దిరోజుల క్రితం గ్రామానికి చెందిన కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు.
● దీనిని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్వాహణ బాధ్యతలను ఎండోమెంట్ పరిధిలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
● వీటిపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపిన అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకొని ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చుతూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
● ఈ మేరకు మంగళవారం ఆ శాఖ అధికారులు వచ్చి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు
● ఆలయాన్ని ప్రభుత్వం ఎండోమెంట్ పరిధిలో చేర్చడాన్ని వీడీసీ సభ్యులతో పాటు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు.
● ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మెట్‌పల్లిలోని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. గతంలోఆలయాన్ని ఎండోమెంట్ పరిధిలో చేర్చాలని ప్రయత్నించిన అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో వెనక్కి తగ్గారు.
● ప్రస్తుతం గ్రామస్తులు ఆందోళన చేస్తుండడంతో అధికారులు ఎలా వ్యవహరిస్తారన్నది హాసక్తిగా మారింది.
ఎండోమెంట్ పరిధిలోకి వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయం
వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు
ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి
ఆలయాన్ని వీడీసీ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేశాం. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వం ఉన్నట్టుండి ఎండోమెంట్ పరిధిలోకి చేర్చడం సరికాదు. వెంటనే దీనిని ఉపసంహరించుకోవాలి. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం.
– శ్రీకాంత్, అధ్యక్షుడు, వీడీసీ
సిబ్బందికి సహకరించాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇక నుంచి ఆలయ వ్యవహారాలన్నీ ఎండోమెంట్ శాఖ పర్యవేక్షిస్తోంది. ఆలయాన్ని అన్ని విధాలుగా మరింత అభివృద్ధి చేస్తాం. ఎవరికై నా అభ్యంతరాలుంటే కమిషనర్ దృష్టికి తీసుకపోవాలి. విధులకు ఆటంకం కలిగించకుండా అందరూ సిబ్బందికి సహకరించాలి.
– సుప్రియ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment