వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉండాలి
● ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి
● రైతులకు పంటల పెట్టుబడి ఖర్చు తగ్గించాలి
● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
● హైడ్రోఫోనిక్స్ సేద్యంపై దృష్టి పెట్టాలి
● జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
● పొలాసలో రాజేంద్రనగర్ వర్సిటీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్
జగిత్యాల అగ్రికల్చర్: వ్యవసాయ రంగం ఉమ్మడి జాబితాలో ఉండాలని, అప్పుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రైతులకు మరింత మేలు జరుగుతుందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ నేపథ్యంలో శుక్రవారం జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉత్తర తెలంగాణలోని శాస్త్రవేత్తలు, రైతులతో కలిసి వేడుకలు నిర్వహించారు. పరిశోధన స్థానానికి 40 ఏళ్లుగా సేవలందిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. దేశంలోనే రైతు రుణమాఫీ చేసిన ఏకై క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. రైతాంగానికి రాష్ట్ర సర్కారు చేసే కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం చేదోడుగా ఉండాలని కోరారు. పంట ఉత్పత్తి వ్యయాన్ని లెక్కలోకి తీసుకొని, మద్దతు ధర చెల్లించాలన్నారు. విప్ లక్ష్మణ్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే పొలాస పరిశోధన స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. శాస్త్రవేత్తలు మరిన్ని పరిశోధనలు చేసి, రైతులకు పంటల పెట్టుబడి ఖర్చు తగ్గించాలని సూచించారు. జిల్లాకు కృషి విజ్ఞాన కేంద్రం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. హైడ్రోఫోనిక్స్ సేద్యంపై దృష్టి పెట్టాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణలో 45 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు. పొలాస కళాశాలలో పీజీ కోర్సులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పరిశోధన స్థానం డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఈసీ మెంబర్ వెంకటేశ్వర్‌రావు, జిల్లా ఉత్తమ రైతు సత్యనారాయణరెడ్డి, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న స్టాళ్లు
శాస్త్రవేత్తలు రూపొందించిన వరి, చెరుకు, పత్తి, నువ్వులు, మొక్కజొన్న విత్తనాలను ప్రదర్శనకు ఉంచారు. అలాగే, వ్యవసాయ కళాశాలల విద్యార్థులు తమ ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా చేపట్టిన పుట్టగొడుగుల పెంపకం, స్వీట్‌కార్న్ వంటి స్టాళ్లు రైతులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పరిశోధన స్థానం ప్రారంభమైన 1983లో శాస్త్రవేత్తగా పనిచేసిన డాక్టర్ భాస్కర్‌రెడ్డి తన అనుభవాలను పంచుకున్నారు. అలాగే, ఉత్తర తెలంగాణ పరిశోధన సావనీర్ విడుదల చేశారు.
ఉత్తమ రైతులకు సన్మానం
ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఉత్తమ రైతులు దండె శంకర్(ఆదిలాబాద్), మహేశ్వర్‌రెడ్డి(కామారెడ్డి), బాలాజీ (ఆసిఫాబాద్), స్వామి(మంచిర్యాల), సుదర్శన్ (నిర్మల్), రాంరెడ్డి (పూడూరు), సత్యనారాయణరెడ్డి(ధర్మపురి), వెంకటేశ్వర్‌రావు (నిజామాబాద్), లక్ష్మారెడ్డి (జోగిన్‌పల్లి), భాగ్యలక్ష్మి(కరీంనగర్), లక్ష్మీపతిగౌడ్ (సిరిసిల్ల)లను సన్మానించారు. అలాగే, రైతు దంపతులైన వెంకట్‌రెడ్డి–పద్మ, బాలయ్య–కనకవ్వ, లక్ష్మి–తిరుపతిలను సత్కరించారు. ఈ రైతులు పంటలు పండించడమే కాకుండా తోటి రైతులకు వ్యవసాయంలో నూతన టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment