అందరికీ రుణమాఫీ ఎప్పుడో.. !
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతులందరికీ రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందోనని అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ ఫలాలు దక్కలేదు. బ్యాంకుల్లో రుణం తీసుకున్న రైతులు రూ.2లక్షలకు పైనున్న మొత్తాన్ని చెల్లిస్తే మిగతా మాఫీ చేస్తామని పలుమార్లు సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ప్రకటించారు. దీంతో అప్పులు తెచ్చి మరీ బ్యాంకుల్లో చెల్లించారు. అయితే ఇప్పటివరకు రూ.2లక్షల మాఫీ సొమ్ము విడుదల కాలేదు.
54,458 మంది రైతులకు మాఫీ..
జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 1,89,276 మంది రైతులు ఉన్నా రు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మొదటి విడతలో రూ.1లక్ష వరకు రుణాలు ఉన్న 26,374 మందికి రూ.149.35కోట్లు, రెండవ విడతలో రూ.1.50 లక్షల రుణం ఉన్న 17,419 మందికి రూ.180.99 కోట్లు, మూడవ విడతలో రూ.2లక్షల వరకు రుణాలు ఉన్న 10,665 మంది రైతులకు రూ.138.98 కోట్లు రుణమాఫీ చేశారు. మొత్తంగా జిల్లాలో 54,458 మంది రైతులకు రూ.469.32 కోట్లు మాఫీ అయింది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా మరో లక్ష మందికి పైగా రుణమాఫీ పొందాల్సి ఉందని అంచనా.
ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తయినా..
రూ.2లక్షలలోపు రుణం ఉన్న పలువురు రైతులకు రేషన్‌కార్డుల వివరాలు సక్రమంగా లేక జిల్లాలో పలువురికి రుణమాఫీ కాలేదు. అయితే రూ.2లక్షల లోపు, ఆపై రుణాలు ఉన్న రైతులకు సంబంధించిన రేషన్‌కార్డులు లేనివారికి ఫ్యామిలీ గ్రూపింగ్ సర్వే ఇటీవల వ్యవసాయ అధికారులు చేపట్టారు. అయినప్పటికీ ఇంతవరకూ వారికి రుణమాఫీ కాలేదు. ఈ విషయమై వ్యవసాయ శాఖ అఽధికారులకు ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పడంలేదు. ఫ్యామిలీ గ్రూపింగ్ చేయడం వరకే పరిమితమైన వారు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నామని, రుణ మాఫీ సొమ్ము ఎప్పుడు, ఎంత జమయ్యేది తమ పరిధిలో లేదని చెపుతున్నారు.
అప్పు చేసి బ్యాంకులో కట్టా..
బ్యాంకులో రూ.2లక్షలకు పైగా రుణం ఉంటే పైమొత్తాన్ని చెల్లిస్తే మాఫీ చేస్తారని చెప్పడంతో అప్పు చేసి కట్టిన. నాకు ఘన్‌పూర్ ఏపీజీవీబీ బ్యాంకులో రూ.3లక్షల అప్పు ఉంది. మాఫీ అవుతుందని రూ.1.02 లక్షలు వడ్డీకి తెచ్చి చెల్లించాను. ఇంతవరకూ మాఫీ కావడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రుణమాఫీ చేసి ఆదుకోవాలి.
– జిట్టెబోయిన వెంకటయ్య, రైతు, ఇప్పగూడెం
రూ.2లక్షలకు పైన రుణం ఉన్న రైతన్నల ఎదురుచూపులు
గ్రామాల్లో ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తయినా తప్పని నిరీక్షణ
జిల్లాలో 1,89,276 మంది రైతులు
రుణమాఫీ అయింది 54,458 మందికి
స్పష్టత ఇవ్వని సర్కారు.. సమాధానం చెప్పలేని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment