నల్లమలకు పర్యాటక శోభ
●
ఎకో టూరిజం అభివృద్ధికి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు
● ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం పంచనున్న నల్లమల, కృష్ణా తీర ప్రాంతాలు
● ప్రత్యేక కళ సంతరించుకోనున్న సోమశిల సర్క్యూట్
● అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేలా ప్రణాళిక
● ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి
ప్రణాళిక రూపొందించాం..
నల్లమలలోని వనరులను ఉపయోగించుకుని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం. టూరిజంతో ఆదాయం పెరగడమే కాక స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. వివిధ అభివృద్ధి పనులకు ప్రణాళిక రూపొందించి.. విడతల వారీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట
పెద్దఎత్తున ఉపాధి..
నల్లమలతోపాటు కృష్ణా తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. ఎకో టూరి జం అభివృద్ధిలో భాగంగా స్థానికులకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలను కల్పిస్తాం. సోమశిల సర్క్యూట్‌ను అభివృద్ధిపరుస్తాం. నల్లమల అటవీ ప్రాంతం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – జూపల్లి కృష్ణారావు,
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి
అచ్చంపేట: ఉమ్మడి జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతం, వన్యప్రాణులను కాపాడటమే కాక ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదం పంచేలా రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం (పర్యావరణ పర్యాటకం)పై దృష్టిసారించింది. అటవీ, ఆలయాలు, నదులు సమూహాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు చారిత్రక, వారస్వత, ఆధ్యాత్మిక కేంద్రాలకు నిలయమైన ఉమ్మడి పాలమూరులో 34 పర్యాటక ప్రాంతాలను గుర్తించారు. ప్రముఖ ఆలయాలు, నదులు, అపురూప కట్టడాలు, నల్లమల అటవీ ప్రాంతం వంటివి ఇప్పటికే అలరిస్తున్నాయి. మరోవైపు అమ్రాబాద్ అభయారణ్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులతో నల్లమల పర్యాటక శోభ సంతరించుకోనుంది. దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేకంగా నిలిచిన నల్లమల అడవుల్లో ఎటు చూసినా పచ్చదనం, భారీ వృక్షాలు, అరుదైన పక్షులు, ఔషధ మొక్కలు, కృష్ణానది జలపాతాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి. ఈ క్రమంలోనే నల్లమల, కృష్ణా తీర ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను చుట్టొచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి.
నల్లమలను గుర్తించేలా..
తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, పర్యాటక వైభవాన్ని ప్రజలకు, భవిష్యత్ తరాలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ క్రమంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్, యూనియర్ టెరిటరీస్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్‌ఏఎస్‌సీఐ) పథకం కింద ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు జిల్లాలోని సోమశిల ఈసర్క్యుట్ల అభివృద్ధి కోసం గత నెల 29న రూ.68 కోట్లు మంజూరు చేసింది. ఈగలపెంట వద్ద బొటానికల్ గార్డెన్, పిల్లల ఆట స్థలాలు, వివిధ శిల్పాల ఏర్పాటు, బోటింగ్ పాయింట్ సిద్ధం చేశారు. లైవ్ రూప్‌టాప్, కాటేజీల నిర్మాణం, హస్తకళల బజారులో చెంచుల జీవన విధానం, అటవీ ఉత్పత్తులు, చెంచులు తయారు చేసిన వస్తువుల ప్రదర్శన, యాంపీ థియేటర్ ఏర్పాటు చేయనున్నారు.
రోప్‌వే ఏర్పాటుకు రూపకల్పన
నల్లమలలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఇందులో రూ.10 కోట్లతో మల్లెలతీర్థంలో కాటేజీలు, రోప్‌వే నిర్మాణ పనులు చేపడుతారు. మరో రూ.5 కోట్లతో వ్యూపాయింట్ అభివృద్ధి, రూ.5 కోట్లతో అక్కమహాదేవి గుహలు, సలేశ్వరక్షేత్రం, భౌరాపూర్ ప్రాంతాల్లో రెండు లాంచర్లు, మరో రూ.5 కోట్లతో డిండి ప్రాజెక్టు వద్ద అభివృద్ధి పనులు చేయనున్నారు. ఉమామహేశ్వర ఆలయం నుంచి మన్ననూర్ వరకు రోప్‌వే ఏర్పాటుకు ఇప్పటికే రూపకల్పన చేశారు.
తొమ్మిది నెలలపాటు సలేశ్వరం సందర్శన..
తెలంగాణ అమరనాథ్‌గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వర క్షేత్రానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తారు. అయితే ప్రతిఏటా ఏప్రిల్‌లో వచ్చే పౌర్ణమికి ఐదు రోజులపాటు మాత్రమే భక్తులను అనుమతిస్తారు. తాజాగా ప్రకృతి పర్యాటకం పేరుతో మూడు నెలలు మినహా 9 నెలల పాటు భక్తులకు అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ మొదలైంది. పర్యావరణానికి, వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాహస యాత్రకు రూపకల్పన చేస్తున్నారు. జీపు సపారీతోపాటు ట్రెక్కింగ్ సహా మొత్తం 6 గంటల వ్యవధితో ప్రత్యేక ప్యాకేజీని అటవీ శాఖ రూపొందిస్తోంది. సలేశ్వరం క్షేత్రానికి నిరంతరం భక్తులను అనుమతించడంతో లోతట్టు ప్రాంతంలోని పుల్లాయిపల్లి, రాంపూర్ చెంచులకు ఉపాధి లభించనుంది.
కృష్ణానదిలో లాంచీ ప్రయాణం
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సోమశిల నుంచి శ్రీశైలానికి కృష్ణానదిలో బోటు ప్రయాణం ద్వారా ఏకో, రివర్ టూరిజం రెండు ఒకేసారి అభివృద్ధి కానున్నాయి. సోమశిల వద్ద స్పీడ్ బోటు షికారు తెచ్చే ప్రయత్నాలను మంత్రి జూపల్లి చేస్తున్నారు.
సోమశిల వద్ద కృష్ణానది తీరం
ఆధ్యాత్మికం.. పర్యాటకం
నల్లమలలో అడుగడుగునా ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు కనిపిస్తాయి. ఉమామహేశ్వర క్షేత్రానికి 24 గంటల పాటు, మన్ననూర్ ప్రతాపరుద్రుడి కోటపైకి పర్యాటకులను అటవీశాఖ ఆంక్షలతో కూడిన అనుమతులు ఇస్తున్నారు. ఫర్హాబాద్ నుంచి వ్యూపాయింట్ సఫారీ దృశ్యం, భౌరాపూర్ బ్రమరాంభమల్లికార్జునస్వామి ఆలయం, భౌరాపూర్ చెరువు, మల్లెలతీర్థం, దోమలపెంట సమీపంలోని ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇప్పటికే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. లోతట్టు ప్రాంతంలోని అక్కమదేవి గుహలు, కడలివనం, దత్తపాదుకల క్షేత్రాలు, శ్రీశైలం, అంతర్‌గంగ, లొద్దిమల్లయ్య, కొల్లాపూర్ ప్రాంతంలోని అమరగిరి, సోమశిల లలితాంబిక సోమేశ్వర క్షేత్రాలు దర్శనానికి అనువుగా ఉన్నాయి.
ఆదాయ మార్గాలు మెరుగు
ఎకో టూరిజం అభివృద్ధితో ఆదాయం పెరగనుంది. ప్రధానంగా వారాంతపు సెలవుల్లో పెద్దఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. పర్యాటక శాఖ ద్వారా గైడ్‌గా ఆయా ప్రాంతాల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి సీఎంగా, పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు ఉండటంతో ఈ ప్రాంతం అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు పర్యాటకులు వస్తుండడంతో ఈ మార్గంలో ప్రైవేట్ రంగంలోనూ హోటళ్లు, విడిది కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment