తీరిన సిబ్బంది కొరత
గద్వాల క్రైం: జిల్లాలోని పలు పోలీస్‌స్టేషన్లలో సిబ్బంది కొరత తీరింది. ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్న 105 మంది కానిస్టేబుళ్లు జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేషన్లలో విధుల్లో చేరారు. ఇన్నాళ్లు అటు సిబ్బంది కొరత.. ఇటు సమస్యాత్మక సంఘటనల నేపథ్యంలో పోలీసుశాఖకు నడిగడ్డ కత్తిమీది సాముగా మారింది. ఉన్న సిబ్బందితోనే అదనపు డ్యూటీలు నిర్వహించడంతో సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టగా.. ఎంపికై న వారికి ఈ ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభించారు. గతనెలలో శిక్షణ పూర్తి చేసుకున్నవారిలో 105 మందిని జిల్లాకు కేటాయించారు. ఇందులో 72 మంది సివిల్ కానిస్టేబుళ్లు రాగా అందులో 25 మంది మహిళలు ఉన్నారు. ఏఆర్ విభాగంలో 33 మందిని కేటాయించగా వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు. కొత్త సిబ్బందికి 15 రోజుల పాటు వివిధ పోలీసు స్టేషన్‌లో నిర్వహించే విధులపై అవగాహన కోసం ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శిక్షణ ఇవ్వనున్నారు.
మొత్తం 712 మంది కానిస్టేబుళ్లు..
జిల్లాలో 14 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఆయా పోలీసు స్టేషన్‌లో 320 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 157 ఏఆర్ కానిస్టేబుళ్లు, 130 హోం గార్డులు విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా చేరిన 105 వారితో కలిపి మొత్తం 712 ఉన్నారు. కొత్త సిబ్బంది రావడంతో జిల్లాలోని పోలీసు స్టేషన్‌లో ఉన్న కొరత చాలా వరకు తీరినట్లయింది. కొత్త ఎంపికై న ఏఆర్ కానిస్టేబుళ్లంతా జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్ ద్వారా విధులు నిర్వహించనున్నారు. పోలీసుశాఖలో ఎస్‌ఐలు, సీఐలు, డీఎస్పీల కొరత లేదు. కానిస్టేబుళ్ల కొరత మాత్రమే ఇన్నాళ్లు ఉండేది.
జిల్లాకు 105 మంది కానిస్టేబుళ్లు
విధుల్లో చేరిక.. ఠాణాల్లో 15 రోజులపాటు ప్రత్యేక శిక్షణ
బాధ్యతతో విధులు నిర్వహించాలి
నూతనంగా విధుల్లోకి చేరిన సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలి. సమస్యలపై వచ్చే బాధితులకు మేమున్నాం అనే భరోసా కల్పించాలి. కమ్యూనిటీ పోలీస్‌సింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజల రక్షణ, వారి హక్కులకు, ఆత్మగౌరవానికి భంగం కలగకుండా మంచి నడవడికతో పోలీసులు మెలగాలి. ఎన్నో సవాళ్లను దాటుకుంటూ విధులు నిర్వహించాలి.
– శ్రీనివాసరావు, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment