పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి
గద్వాల: ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలను చెల్లించకపోవడం సిగ్గుచేటని టీయూసీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆ సంఘం కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. గ్రామపంచాయతీ కార్మికులకు జీఓ నెం.60 ప్రకారం వేతనాలు పెంచాలని, అలాగే పెండింగ్ వేతనాలను చెల్లించాలని, ఈఎస్‌ఐ అమలు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని తదితర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు త్వరలో చేపట్టబోయే అసెంబ్లీ ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టియూసీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ, నాయకులు హనుమంతు, చంద్రాములు, సవారన్న, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హరీశ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment