కన్నేసి.. కాజేసే యత్నం
వ్యవసాయ మార్కెట్‌యార్డు స్థలం కబ్జాకు స్కెచ్
●
నోటీసులు ఇచ్చాం
గతంలో మార్కెట్‌యార్డులో ఉన్న కొంతమంది కమీషన్‌దారులకు చింతలపేటకు వెళ్లే రహదారి ఉత్తరం వైపు స్థలాలు విక్రయించడం జరిగింది. ఇలా స్థలాలు కొనుగోలు చేసిన 26మంది నిబంధనలకు విరుద్ధంగా మార్కెట్‌యార్డు ప్రహరీని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలుసుకుని వారికి నోటీసులు ఇచ్చాం. ఎవరైన మార్కెట్‌యార్డు రహదారిని తొలగిస్తే వారిపై 1966, 1969 యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణం మున్సిపాలిటీ పరిధిలోనిది. తమకు ఎలాంటి సంబంధం లేదు.
– నర్సింహులు, మార్కెట్ కమిటీ
స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గద్వాల
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
మున్సిపల్ డ్రైనేజీ నిర్మాణం తమకు తెలియకుండానే తొలగించి తిరిగి నూతన డ్రైనేజీ చేపడుతున్నారు. విషయంపై ఇదివరకే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆర్డీఓ ఆధ్వర్యంలో విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటాం.
– దశరథ్, మున్సిపల్ కమిషనర్, గద్వాల
విచారణ చేయించి చర్యలు
మున్సిపల్ డ్రైనేజీని ఆక్రమించిన విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై ఽఅధికారులతో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
– నర్సింగ్‌రావు, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్
గద్వాల: ‘వడ్డించే వాడు మనోడైతే.. కూర్చున్న చోటుకే వస్తాయి’ అనే సామేతను అక్రమార్కులు బాగా వంట పట్టించుకున్నారు. మనకు పలుకుబడి ఉంది.. మనల్ని ఎవరు ప్రశ్నిస్తారు అనే తెగింపుతో మున్సిపాలిటీ అనుమతులు లేకుండానే 20 ఫీట్ల డ్రైనేజీని తొలగించి 10 ఫీట్లకు కుదించి నిర్మాణం చేపట్టారు. ఈ డ్రైనేజీని ఆనుకుని ఉన్న వ్యవసాయ మార్కెట్‌యార్డు ప్రహరీ నిర్మాణాన్ని తొలగించి పెద్ద ఎత్తున షాపులను నిర్మించుకునేలా రూ.కోట్ల విలువైన స్థలాన్ని కాజేసేలా భారీ స్కెచ్ వేశారు. కొందరు కమీషన్ ఏజెంట్లు. వీరికి ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న నేతల అండదండలు పుష్కలంగా లభించడంతో చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ శాఖ అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడలేకపోతున్నారు.
కమీషన్‌దారులు పక్కా ప్లాన్
62 ఎకరాల 26గుంటల విస్తీర్ణంలో 1972లో గద్వాల వ్యవసాయ మార్కెట్‌ను నిర్మించారు. మార్కెట్‌యార్డు ఏర్పాటు చేసిన అనంతరం కొంతమంది కమీషన్‌దారుల (ఖరీద్దారులు)కు మార్కెట్‌యార్డు స్థలంలో ప్లాట్లు చేసి విక్రయించారు. ఇదిలాఉండగా గద్వాల జిల్లా కేంద్రం అయిన తరువాత భూముల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. దీంతో 60–40సైజు గల ప్లాటు కనిష్టంగా రూ.50–రూ.60లక్షలు పలుకుతుంది. ఇక్కడే కమీషన్‌దారులకు ఆశ పుట్టింది. గతంలో తమకిచ్చిన స్థలాలకు ఆనుకుని ఉన్న మార్కెట్‌యార్డు ప్రహరీని తొలగించి పెద్ద సైజులో షాపులను నిర్మించుకోవచ్చని భారీ స్కెచ్ వేశారు. ఈ షాపులు రెండు భాగాలుగా విభజించి మార్కెట్‌యార్డు లోపలి వైపు ఒకటి, రైల్వేసేష్టన్ ప్రధాన రహదారి వైపు మరోషాపు నిర్మించేలా కుట్రకు తెరలేపారు.
మున్సిపాలిటీకి చెందిన 20 ఫీట్ల
డ్రెయినేజీని 10 ఫీట్లకు కుదించి నిర్మాణం
పెద్ద ఎత్తున షాపులు నిర్మించుకునేలా ప్లాన్
వంత పాడుతున్న కొందరు నేతలు
పట్టించుకోని మున్సిపల్ అఽధికారులు
ఇప్పటికే విలువైన ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం
కబ్జాలకు నిలయం
గద్వాలలో భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతుండడంతో ప్రభుత్వ ఖాళీ స్థలాలను కొందరు అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. కుంటవీధి, సుంకులమ్మమెట్టు, భీంనగర్, రెండవ రైల్వే గేటు కాలనీ (బీరెల్లి రహదారి), వేణుకాలనీ, కొత హౌసింగ్ బోర్డు కాలనీలలో రూ.కోట్లు విలువైన స్థలాలు అక్రమార్కుల చేతితో అన్యాక్రాంతమయ్యాయి. అదేవిధంగా పదిశాతం స్థలాలపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా వాటిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment