విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలి
అలంపూర్: కస్తూర్భా పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన బోధన, నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని, అది మీ బాధ్యత అని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను జడ్జి న్యాయవాదులతో కలిసి సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జడ్జి.. వంట గదిలోకి వెళ్లి న్యాయవాదులను వంటకాలను రుచి చూడమనగా, అవి నాణ్యతగా లేవని బదులిచ్చారు. విద్యార్థులకు రుచితోపాటు నాణ్యతగా పౌష్టికాహారం అందించాలని ఇన్‌చార్జ్‌కు సూచించారు. ఉపాధ్యాయులతో కలిసి బాత్రూంలను పరిశీలించి అపరిశుభ్రంగా ఉండడం, దుర్వాసన వస్తుండడాన్ని గమనించి ఇలా ఉంటే విద్యార్థుల ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నించారు. బాత్‌రూంలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే, పాఠశాల ఆవరణలో చీకటిలో విద్యార్థులు చదువుతుండగా.. రోజు ఇలా చీకట్లోనే చదువుతారా అని జడ్జి ప్రశ్నించారు. పాఠశాలలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని, ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. వీరితోపాటు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, ఏజీపీ మధు, న్యాయవాదులు రాజేశ్వరి, శ్రీధర్ రెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్, గజేంద్ర గౌడ్, ఏజీపీ మధు, లోక్‌అదాలత్ సిబ్బంది జహంగీర్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment