ఉద్యోగ భద్రత కల్పించాలి
గద్వాల: జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు కదం తొక్కారు. తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. అందులో భాగంగా మంగళవారం స్థానిక స్మృతివనం దగ్గర దీక్ష చేపట్టారు. తక్షణం రెగ్యులర్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు చేతబట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కేజీబీవీ సీఆర్‌టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్‌ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనకు తరలివచ్చారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన ఈ ఆందోళనకు పలు సంఘాల నాయకులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగులందరూ సామూహిక సెలవు ప్రకటించడంతో ఆయా సంస్థలలో కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ముఖ్యంగా కేజీబీవీలలో బోధన నిలిచిపోయింది. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు హుస్సేనప్ప, గోపాల్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు కనీస వేతన స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. ప్రతి ఉద్యోగికి రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. పీటీఐలకు 12 నెలలతో కూడిన వేతనం ఇవ్వాలన్నారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. వివిధ సంఘాల నాయకులు ప్రభాకర్, ఏక్బాల్‌పాష, నాగరాజు, అతికూర్ రహమాన్, స్వామి తదితరులు మద్దతు ప్రకటించారు.
కదం తొక్కిన సమగ్ర శిక్ష ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment