నెయ్యి కొనుగోలులో ప్రతిష్టంభన | - | Sakshi
Sakshi News home page

నెయ్యి కొనుగోలులో ప్రతిష్టంభన

Published Fri, Sep 27 2024 3:54 AM | Last Updated on Fri, Sep 27 2024 3:54 AM

నెయ్య

ప్రభుత్వ నిర్ణయం కోసం అన్నవరం

ఆలయ అధికారుల ఎదురుచూపులు

ఈ నెలాఖరుతో ముగియనున్న

సరఫరా టెండర్‌

అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి మార్చి 31,

2025 వరకు కొత్త టెండర్‌

కేజీ రూ.484 రేటుతో

లోయెస్ట్‌–1 గా వినాయక ఎంటర్‌ప్రైజెస్‌

అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ప్రసాద విభాగంలో ఆవు నెయ్యి కొనుగోలు విషయమై ప్రతిష్టం భన నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న పద్ధతి ప్రకారం టెండర్‌ ద్వారా లోయెస్ట్‌గా వచ్చిన సంస్థ నుంచి కొనుగోలు చేయాలా లేక ప్రభుత్వం కొత్తగా నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుత నెయ్యి సరఫరా టెండర్‌ ఈ నెల 30 వరకు మాత్రమే ఉంది. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి కొత్త సప్లయ్‌ దారు నుంచి నెయ్యి కొనుగోలు చేయాల్సి ఉంది.

ఇప్పటికే పూర్తయిన టెండర్‌ ప్రక్రియ

అన్నవరం దేవస్థానంలో ఆరు నెలలకొకసారి టెండర్‌ ద్వారా ఆవు నెయ్యి కొనుగోలు చేస్తుంటారు. గతంలో టెండర్‌ ద్వారా మాత్రమే కొనుగోలు చేయగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వచ్చాక టెండర్‌లో లోయెస్ట్‌ ఖరారయ్యాక మళ్లీ రివర్స్‌ టెండర్‌ ద్వారా ఎవరు తక్కువకు ఇస్తే వారి ద్వారా కొనుగోలు చేసే పద్ధతి ప్రవేశ పెట్టారు. దాని ప్రకారం అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి 2025, మార్చి 31 వరకు ఆవు నెయ్యి సరఫరాకు ఆగస్టు నెలలో ఈ ప్రొక్యూర్‌ టెండర్‌ పిలిచారు. ఆ తరువాత రివర్స్‌ టెండర్‌ ద్వారా నెయ్యి సరఫరాకు తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీ కిలో రూ.484కి సరఫరా చేయడానికి కొటేషన్‌ దాఖలు చేసి ఎల్‌–1 గా నిలిచింది. కాగా విశాఖపట్నానికి చెందిన విశాఖ డెయిరీ కిలో రూ.488 కి సరఫరా చేయడానికి కోటేషన్‌ దాఖలు చేసి ఎల్‌–2 గా నిలిచింది. మామూలు పరిస్థితుల్లో అయితే ఇప్పటికే నెయ్యి సరఫరా టెండర్‌ ఖరారు చేసేవారు. కాని తిరుమలకు సరఫరా చేస్తున్న నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలతో నెయ్యి కొనుగోలుపై దేవస్థానం అధికారులు ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఏడాదికి రెండు లక్షల కిలోల నెయ్యి కొనుగోలు

అన్నవరం దేవస్థానంలో ప్రసాదం తయారీలో ఏటా సుమారు రెండు లక్షలు కిలోల నెయ్యి ఉపయోగిస్తున్నారు. ప్రతి నెలా సుమారు 12వేల కేజీల నుంచి 20 వేల కేజీల వరకు ఉపయోగిస్తారు. ఆరు నెలలకొకసారి టెండర్‌ పిలిచి నెయ్యి కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాది టెండర్‌ ద్వారా కిలో నెయ్యి రూ.564కి కొనుగోలు చేశారు. ఏటా నెయ్యి కొనుగోలుకు రూ.ఆరు కోట్ల నుంచి రూ. పది కోట్లు వరకు దేవస్థానం ఖర్చు చేస్తోంది.

నాణ్యతపై రాజీ లేదు

దేవస్థానానికి నెయ్యి సరఫరా టెండర్‌ దారుడు ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి నాణ్యమైన నెయ్యిని సరఫరా చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు లాబ్‌ సర్టిఫికెట్‌లు జత చేయాలని అధికారులు తెలిపారు. దేవస్థానం కూడా విజయవాడలోని ల్యాబ్‌కు పంపించి మళ్లీ టెస్ట్‌ చేయిస్తుంది. అది నాణ్యమైన నెయ్యి అని తేలితేనే దానిని ప్రసాదంలో ఉపయోగిస్తామని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నెయ్యి కొనుగోలు

ఏటా మాదిరి లోయెస్ట్‌ కొటేషన్‌ను ఎంపిక చేశాం. ఇంకా వారికి సరఫరా ఆర్డర్‌ ఇవ్వలేదు. అయితే తిరుపతి నెయ్యి వివాదం వలన ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. టెండర్‌ ద్వారా కొనుగోలుకు అనుమతిస్తే లోయెస్ట్‌ సప్లయిదారు నుంచి కొనుగోలు చేస్తాం. ఒకవేళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పద్ధతి ప్రకారం కొనుగోలు చేయాలని ఆదేశిస్తే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం.

– కే రామచంద్రమోహన్‌,

ఈఓ, అన్నవరం దేవస్థానం

No comments yet. Be the first to comment!
Add a comment
నెయ్యి కొనుగోలులో ప్రతిష్టంభన1
1/2

నెయ్యి కొనుగోలులో ప్రతిష్టంభన

నెయ్యి కొనుగోలులో ప్రతిష్టంభన2
2/2

నెయ్యి కొనుగోలులో ప్రతిష్టంభన

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement