వర్జీనియా పొగాకుకు డిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

వర్జీనియా పొగాకుకు డిమాండ్‌

Published Fri, Sep 27 2024 3:54 AM | Last Updated on Fri, Sep 27 2024 3:54 AM

వర్జీనియా పొగాకుకు డిమాండ్‌

దేవరపల్లి: అంతర్జాతీయ మార్కెట్లో వర్జినియా పొగాకుకు డిమాండ్‌ పెరిగిందని పొగాకు బోర్డు చైర్మన్‌ సీహెచ్‌ యశ్వంత్‌కుమార్‌ తెలిపారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పొగాకు రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ ఏడాది మార్కెట్లో రైతులకు మంచి ధర లభించిందన్నారు. కిలో గరిష్ట ధర రూ.410 పలికిందన్నారు. దీనికి కారణం బ్రెజిల్‌, జింబాబ్వేలో పొగాకు ఉత్పత్తి గణనీయంగా తగ్గడమే అని తెలిపారు. రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోని తూర్పు, ఏలూరు జిల్లాల్లో గల ఐదు వేలం కేంద్రాల్లో పండించిన ఎన్‌ఎల్‌ఎస్‌ (నార్తరన్‌ లైట్‌ సాయిల్‌) పొగాకుకు డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు. 2024–25 ఏడాదిలో బ్రెజిల్‌, జింబాబ్వే దేశాల్లో పంట ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. జింబాబ్వేలో 2.50 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఎస్‌బీఎస్‌, ఎస్‌ఎల్‌ఎస్‌ పొగాకు ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఆఫ్రికా దేశాల్లో పండిస్తున్న బర్లీ పొగాకు సాగు ఎక్కువగా ఉందని తెలిపారు. 2024–25 పంట కాలంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాల పరిధిలో 167 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలిపారు. దీనికి మించి పంట ఉత్పత్తి చేస్తే అదనపు పొగాకు అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం అపరాధ రుసుం వసూలు చేస్తుందన్నారు. ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రాంతంలో 58.75 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఉందని, బ్యారన్‌కు 41.25 క్వింటాళ్ల ఉత్పతికి అనుమతి ఇచ్చినట్టు ఆయన తెలియజేశారు. తొర్రేడు ప్రాంతంలో పండిస్తున్న బ్లాక్‌ సాయిల్‌(బీఎస్‌) పొగాకు 3.48 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇచ్చినట్టు చెప్పారు. బ్యారన్‌కు 35.50 క్వింటాళ్లు ఉత్పత్తి చేయాలన్నారు. బర్లీ పొగాకు 200 మిలియన్ల కిలోలు ఉత్పత్తి అవుతుందన్నారు. లోగ్రేడు పొగాకు అమ్మకోవడంలో రైతులు విఫలమయ్యారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement