రెండు బైక్‌లను ఢీకొన్న కారు
● ఒకరి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
● సాలూర క్యాంప్ వద్ద ప్రమాదం
బోధన్ రూరల్ : సాలూర మండలం సాలూర క్యాంప్ గ్రామ సమీపంలో బుధవారం కారు అతివేగంతో రెండు బైక్‌లను ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. బోధన్ పట్టణానికి చెందిన షేక్ దావుద్ కారులో కుటుంబంతో కలిసి మహారాష్ట్రకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో సాలూర క్యాంప్ శివారులో బైక్‌పై వెళ్తున్న బోధన్ మండలం భూలక్ష్మి క్యాంప్ గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డిని దావూద్ కారు వేగంగా ఢీకొట్టింది. మహేందర్ రెడ్డి కింద పడిపోగా తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌ను ఢీకొట్టిన అనంతరం రాంగ్ రూట్‌లోకి మళ్లిన కారు అదే సమయంలో ఎదురుగా వస్తున్న మహారాష్ట్రలోని దౌలపూర్‌కు చెందిన మహబూబ్, రషీద్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడిపిస్తున్న షేక్ మహబూబ్ (42) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున రషీద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment