మంత్రి గారూ.. నిధులివ్వరూ? | - | Sakshi
Sakshi News home page

మంత్రి గారూ.. నిధులివ్వరూ?

Published Fri, Dec 13 2024 1:44 AM | Last Updated on Fri, Dec 13 2024 1:45 AM

మంత్ర

మంత్రి గారూ.. నిధులివ్వరూ?

నిజాంసాగర్‌: నిజాంసాగర్‌ ప్రధాన కాలువ 150 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గతంలో ప్రాజెక్టు ద్వారా 2.75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందేది. అయితే ప్రధాన కాలువ కట్ట బలహీనంగా మారడంతో చివరి ఆయకట్టుకు సాగు నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆయకట్టు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు ప్రధాన కాలువ సిమెంట్‌ లైనింగ్‌ కోసం రూ. 549.5 కోట్లు మంజూరు చేశారు. 15 ప్యాకేజీలుగా విభజించి పనులకు శ్రీకారం చుట్టారు. నాలుగైదేళ్లలో పూర్తికావాల్సిన పనులు.. ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రధాన కాలువ మట్టి కట్టతో పాటు సిమెంట్‌ లైనింగ్‌, డిస్ట్రిబ్యూటరీ తూముల ఆధునికీకరణ పనుల్లోనూ నాణ్యత లోపించింది. దీంతో పదికాలాల పాటు పక్కగా నిలవాల్సినవి మూణ్ణాళ్లకే పగుళ్లు వచ్చాయి.

ఆ రెండు ప్యాకేజీల సంగతి అంతేనా?

నిజాంసాగర్‌ ప్రధాన కాలువ ఒకటి, రెండు ప్యాకేజీల్లో ఆధునికీకరణ పనులు అసంపూర్తిగా మిగిలాయి. ఒక్కో ప్యాకేజీకి రూ. 35 కోట్లతో పనులు ప్రారంభించారు. ఒకటో ప్యాకేజీలో 90 శాతం మేర పనులు పూర్తయ్యాయి. మిగతా పనులను గాలికి వదిలేశారు. రెండో ప్యాకేజీలో నామమాత్రంగానే పనులు చేపట్టారు. ఐదు, ఆరో డిస్ట్రీబ్యూటరీల మధ్య ప్రధాన కాలువ సిమెంట్‌ లైనింగ్‌ పనులను వదిలేశారు. దాంతో ప్రధాన కాలువ కొట్టుకుపోకుండా ఏర్పాటు చేసిన బండరాళ్లు ఊడిపోయి, కాల్వ కట్ట గోడలు కూలి పోయి అధ్వానంగా తయారయ్యాయి. అంతేకాకుండా కాలువ కట్టకు ఇరువైపులా చెట్లు పెరగడంతో ప్రమాదకరంగా మారింది. రెండో ప్యాకేజీలో కిలోమీటర్‌ మేర సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేయాల్సి ఉంది. ప్రధాన కాలువ సిమెంట్‌ లైనింగ్‌ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాలుగేళ్ల నుంచి పత్తాలేకుండా పోయారు.

మహమ్మద్‌నగర్‌ మండలంలో ఉన్న సింగితం రిజర్వాయర్‌ రిటెయినింగ్‌ వాల్‌ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో రిజర్వాయర్‌ ఖాళీ అయ్యింది. రిజర్వాయర్‌ అలుగు ముందు ఏర్పడిన బుంగలు రిటెయినింగ్‌ వాల్‌ కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం అయ్యాయి. రిజర్వాయర్‌ ద్వారా మహమ్మద్‌నగర్‌, నర్వ, గున్కుల్‌ గ్రామాల పరిధిలోని 546 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. అయితే రిటెయినింగ్‌ వాల్‌ కొట్టుకుపోవడంతో పాటు కుడి, ఎడమ పంట కాలువలు శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు సాగు నీరు అందే పరిస్థితి లేదు. రిజర్వాయర్‌ రిటెయినింగ్‌ వాల్‌తో బుంగలకు శాశ్వత మరమ్మతులు చేపట్టాలని, కుడి, ఎడ కాలువలకు సిమెంట్‌ లైనింగ్‌ పనులు చేయించాలని రైతులు కోరుతున్నారు.

మొరాయిస్తున్న గేట్లు..

నిజాంసాగర్‌ ప్రాజెక్టు 12 గేట్ల ప్రాంతంలోని 6, 7, 11 ఫ్లడ్‌ గేట్లు తరచూ మొరాయిస్తున్నాయి. శుక్రవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టునుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. అయితే మంత్రి ఎత్తే గేట్లు సైతం మెరుగ్గా ఏమీ లేవు. ఇక్కడ రెండు గేట్లు మొరాయిస్తున్నాయి. ఎత్తిన గేట్లను దించాలంటే గజ ఈతగాళ్లు సాయం చేయాల్సిందే.. ఫ్లడ్‌ గేట్లకు మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. మహ్మద్‌నగర్‌ శివారులో నిజాంసాగర్‌ ప్రధాన కాలువకు ఇటీవల బుంగపడింది. మంత్రి ఆయా అంశాలపై దృష్టి సారించి, నిధులు మంజూరు చేసి సాగునీటి సమస్యలు పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అసంపూర్తిగా ‘సాగర్‌’

ప్రధాన కాలువ లైనింగ్‌ పనులు

కొట్టుకుపోయిన సింగితం

రిజర్వాయర్‌ రిటెయినింగ్‌ వాల్‌

కుడి, ఎడమ కాలువలకు బుంగలు

వృథా అవుతున్న జలాలు

మంత్రి దృష్టి సారించాలని

కోరుతున్న రైతులు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువ సిమెంట్‌ లైనింగ్‌ పనులు దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. డిస్ట్రిబ్యూటరి తూముల ఆధునికీకరణ పనుల్లో నాణ్యత లోపించడంతో అధ్వానంగా మారాయి. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలతో సింగితం రిజర్వాయర్‌ రిటెయినింగ్‌ వాల్‌ కొట్టుకుపోయి నీరు వృథా అయ్యింది. శుక్రవారం జిల్లాకు వస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి.. ఆయా అంశాలపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
మంత్రి గారూ.. నిధులివ్వరూ?1
1/1

మంత్రి గారూ.. నిధులివ్వరూ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement