సొంతింటి కల నెరవేరేనా?
కామారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించేందుకుగాను గ్రామాలు, మున్సిపాలిటీల పరిధిలో సర్వే ప్రక్రియ ప్రారంభించింది. అర్హులను గుర్తించిన అనంతరం ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో గ్రామసభలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితాలను సిద్ధం చేయనున్నారు. ముందుగా ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. దీంతో నిరుపేదల్లో మళ్లీ ఆశలు చిగురించాయి.
యాప్‌లో వివరాల నమోదు
ప్రభుత్వం మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇంటి నిర్మాణాలకు సంబంధించి బాత్‌రూం, వంటగది తప్పనిసరిగా ఉండేలా ప్లాన్‌ను కూడా ఇప్పటికే రూపొందించారు. తాజాగా లబ్ధిదారుల ఎంపిక సర్వే ప్రారంభమైంది. 500 ఇళ్లకు ఒకరిని నియమించి సర్వే బాధ్యతలు అప్పగించారు. సర్వేయర్‌లుగా పంచాయతీ కార్యదర్శులను నియమించారు. వారు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారుల వివరాలను యాప్‌లో పొందుపరుస్తున్నారు. వివరాలు నమోదు చేశాక సదరు కుటుంబం ఈ పథకానికి అర్హులేనా, కాదా అనేది యాప్ నిర్ణయిస్తుంది.
భారీగా దరఖాస్తులు..
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి దాదాపు ఏడాది క్రితం ప్రజాపాలన పేరుతో దరఖాస్తులను స్వీకరించింది. జిల్లాలో ఆయా అంశాలకు సంబంధించి మొత్తం 2,94,800 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇందిరమ్మ ఇల్లు కోసం లక్షకుపైగా దరఖాస్తులున్నాయి.
మహిళ పేరుమీదే ఇల్లు..
ఇందిరమ్మ ఇంటిని కుటుంబంలోని మహిళ పేరుమీదే మంజూరు చేయనున్నారు. ఇల్లు పొందాలని కోరుకునే వారు రేషన్ కార్డు కలిగి ఉండి స్థానికుడై ఉండాలి. లబ్ధిదారులుగా ఎంపికై నవారు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆర్‌సీసీ ఇల్లు నిర్మించుకోవాల్సి ఉంటుంది. నాలుగు విడతల్లో ఆర్థిక సాయం అందిస్తారు. బేస్‌మెంట్ లెవల్‌కు రూ.లక్ష, స్లాబ్ లెవల్‌కు రూ.లక్ష, స్లాబ్ పూర్తయిన తర్వాత రూ.2 లక్షలు, మొత్తం ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.లక్ష చెల్లిస్తారు.
అర్హుల సమాచారాన్ని పక్కాగా సేకరించాలి
కామారెడ్డి రూరల్: ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అర్హుల సమాచారాన్ని పక్కాగా సేకరించి యాప్‌లో పొందుపరచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం గూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల పూర్తి వివరాలను సేకరించి యాప్‌లో నమోదు చేయాలన్నారు. అవసరమైన భూమి పత్రాలు, ఆహార భద్రత కార్డు, ఇంటి యజమానురాలు ఫొటోలను సేకరించాలని, తద్వారా యాప్‌లో పొందుపరచాలని తెలిపారు. సర్వేకు ఒకరోజు ముందు ఆ గ్రామంలో చాటింపు వేయించాలని సూచించారు. ఆయన వెంట ఆర్డీవో రంగనాథ్‌రావు, మండల ప్రత్యేకాధికారి తిరుమల ప్రసాద్, తహసీల్దార్ జనార్దన్, ఎంపీడీవో నాగవర్ధన్ పంచాయతీ కార్యదర్శి సంగీత ఉన్నారు.
ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల సర్వే
జిల్లాలో లక్షకుపైగా దరఖాస్తులు..
నియోజకవర్గానికి
3,500 ఇళ్లు మంజూరు!
Comments
Please login to add a commentAdd a comment