‘డ్రాపవుట్ విద్యార్థులను గుర్తించాలి’
కామారెడ్డి క్రైం: చదువు మానేసిన ఇంటర్ విద్యార్థులను గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్స్, అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కళాశాలల విద్యార్థులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మానసికంగా బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి టేలి మానస్ నంబర్ 14416 ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. ఆత్మహత్యల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఉదయం మెడిటేషన్, యోగాలాంటి కార్యక్రమాలను కళాశాలల్లో నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం, ఎస్సీ సంక్షేమ అధికారి రజిత, మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
‘గ్రూప్ –2’ను సజావుగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం: గ్రూప్ –2 పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ఈనెల 15, 16 తేదీల్లో గ్రూప్ –2 పరీక్షలు జరగనున్న నేపథ్యంలో గురువారం పరీక్షల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులను తనిఖీ చేయడం, బయోమెట్రిక్ హాజరును వేగంగా నిర్వహించాలన్నారు. ఎక్కడా సమయాన్ని వృథా చేయరాదన్నారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌సీవో విజయ్ కుమార్, అడిషనల్ ఆర్‌సీవో శంకర్, అధికారులు పాల్గొన్నారు.
రేపు సబ్ జూనియర్
హ్యాండ్‌బాల్ జట్ల ఎంపికలు
కామారెడ్డి అర్బన్: కౌలాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాలుర హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగామోహన్, సురేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను వచ్చే నెలలో హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. వివరాలకు 96425 35535, 96405 73703 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment