రుణమాఫీ కాలేదు.. విత్తనాల జాడలేదు
కరీంనగర్ అర్బన్: యాసంగి సాగుకు సన్నద్ధమవుతున్న రైతులను సమస్యలు నీడలా వెంటాడుతున్నాయి. సీజన్ ప్రారంభమై నెల రోజులు దాటుతుండగా రైతుబంధు జమకాకపోగా, రుణమాఫీ పూర్తవకపోగా, రాయితీ విత్తనాల ఊసే లేదు. యాంత్రీకరణ పథకం పడకేయగా పండించిన ధాన్యాన్ని విక్రయిస్తే డబ్బుల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతుండగా కూరగాయలు సాగు చేసేవారికి ప్రోత్సాహం కరువైంది.
రైతుబంధు.. పంట డబ్బులేవి?
అన్నదాతకు ఆర్థిక భరోసాగా ప్రభుత్వం పెట్టుబడిసాయం చేస్తుండగా ఇంకా అతీగతి లేదు. వానాకాలం రైతుబంధు విడుదల చేయకపోగా యాసంగి సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం అందలేదు. ఏటా ఎకరాన రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.15వేల విధానం నేటికి ఆచరణకు నోచుకోలేదు. జిల్లాలో గత సంవత్సరం యాసంగి సాగులో 1.61లక్షల మంది రైతులకు గానూ 1.47 లక్షల మందికి రూ.150కోట్లు విడుదల చేశారు. సాగు చేయబడే విస్తీర్ణానికే రైతుబంధు ఉంటుందని సీఎం, మంత్రులు ప్రకటించగా వానాకాలం నుంచి రైతుబంధు జాడ లేదు. ఇక ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోలు చేసిన 48గంటల్లోనే నగదు ఖాతాకు చేరుతుందని ప్రభుత్వం ప్రకటించగా క్షేత్రస్థాయిలో మాత్రం విరుద్ధ పరిస్థితి. వారం రోజులు దాటినా డబ్బులు పడటం లేదని రైతులు వాపోతున్నారు. ఽజిల్లాలో రూ.కోట్లలో రైతుల ఖాతాకు చేరాల్సి ఉంది. ఽత్వరితగతిన ఖాతాకు నగదు మళ్లిస్తే పెట్టుబడికి ఆసరాగా ఉంటుంది.
రుణమెప్పుడో..?
సకాలంలో రుణాలివ్వాల్సిన బ్యాంకర్లు కొర్రీలతో వేధిస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. ఏటా రుణ ప్రణాళికను రూపొందిస్తుండగా లక్ష్యాన్ని చేరుకున్న దాఖలాలే లేవు. రుణమాఫీ పరిపూర్ణం కాకపోవడం ఇంకా లబ్ధిదారుల సేకరణలో బ్యాంకర్లు తలమునకలవడం విశేషం. మంత్రుల సమీక్షలో రుణాలిస్తామని తలలూపడం తప్పా ఆచరణలో అదే నిర్లక్ష్యం. ప్రభుత్వం రూ.2లక్షల వరకు రుణమాఫీ ప్రకటించగా చాలామందికి మాఫీ కాలేదు. సాంకేతిక కారణాల పేరుతో జాప్యం చేస్తుండగా ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకున్న బ్యాంకర్లు రుణాలిచ్చేందుకు దాటవేత ధోరణి అనుసరిస్తున్నారు.
అవసరం కొండంత.. ఆసరా గోరంత
ఏటా అరకొర విత్తనాలు మాత్రమే సరఫరా అవుతుండగా ప్రధానంగా అవసరమైన వరి విత్తనాలను ఆశించినస్థాయిలో ఇవ్వడం లేదు. వేరుఽశనగ, కందులు, శనగ, మినుములు, పెసలు ఇతర విత్తనాలు ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉండగా ఇంకా విత్తనాలే రాకపోవడం ఆందోళనకర పరిణామం. ఏటా పంపిణీ చేసే విత్తనాలు క్షేత్రస్థాయి డిమాండ్‌కు ఏ మాత్రం సరిపోవడం లేదు. పరిఽశోధనస్థానాలు గానీ విత్తనాభివృద్ధి సంస్థలు విత్తనాల నిల్వలపై ప్రచారం లేకపోవడం శోచనీయం.
యాంత్రీకరణ అటకెక్కినట్టేనా.?
రైతులను ఆధునిక సాగు వైపు మలిచేలా చర్యలుండాల్సి ఉండగా చేయూత లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2012 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో యాంత్రీకరణ పథకం అమలులో ఉండగా ట్రాక్టర్లు, ఇతర పనిముట్లు రాయితీపై ఇచ్చేవారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకతో యాంత్రీకరణ పథకానికి స్వస్తి పలికారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా మళ్లీ సదరు పథకం తెరపైకి వచ్చింది. నిధులు కేటాయించడంతో రైతులను సాంకేతిక సాగు వైపు మళ్లిస్తామని మంత్రులు స్పష్టం చేశారు. ప్రకటనల వరకే తప్పా ప్రగతిలో లేదని రైతులు వాపోతున్నారు.
అందని రైతుబంధు.. కానరాని పంట డబ్బులు
అన్నదాతకు నలుదిక్కులా సమస్యలే
యాసంగి సాగుపై సందిగ్ధం
Comments
Please login to add a commentAdd a comment