సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఖాతాదారులు!
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు కస్టమర్లు సైబర్ నేరగాళ్లు ఇచ్చే సొమ్ముకు ఆశపడి తమ ఆధారాలన్నీ ఇచ్చేస్తున్నారు. వీటి ఆధారంతో దుండగులు ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. తాము కొట్టేసిన సొమ్మును అందులో జమచేస్తున్నారు. వెంటనే వేరే అకౌంట్లకు మళ్లిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంగా సుమారు 16 నెలలుగా ఈ దందా పెద్దఎత్తున సాగుతోంది.
వెల్గటూరుకు చెందిన ఇద్దరి పాత్ర..
జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు స్థానిక బీట్‌బజార్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. పట్టణంలోని కొందరికి డబ్బు ఆశచూపి మచ్చిక చేసుకుంటున్నారు. ముంబాయిలోని ప్రధాన కార్యాలయాల ఉద్యోగులతో మాట్లాడి.. స్థానికంగా లావాదేవీలు జరిపే రెండు ప్రైవేటు బ్యాంకుల్లో ఆధారాలు ఇచ్చిన వారిపేరిట ఆన్‌లైన్ బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. ఖాతా తెరిచే సమయంలోనే ఆధారాలు ఇచ్చే వ్యక్తి మొబైల్ నంబరును లింక్ చేస్తున్నారు. మరుసటి రోజే ఆ ఫోన్‌నంబరు మార్చి ఇంకో మొబైల్‌నంబరు లింక్ చేస్తున్నారు. ఫలితంగా ఏటీఎం కార్డు, పాస్‌వర్డ్ సైతం వారి చేతికే చిక్కుతున్నాయి. దీంతో ఖతాదారుకు తెలియకుండానే ఒక్కో అకౌంట్ నుంచి నెలకు కనీసం రూ.2 కోట్ల – రూ.3 కోట్ల లావాదేవీలు చేస్తున్నారు. ఒక్కోసారి తమ అకౌంట్‌లో కొంత సొమ్ము జమచేస్తున్న కస్టమర్లు.. తమ ఫోన్‌నంబరుకు మెసేజ్ రాకపోవడంతో బ్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు.
వెలుగులోకి ఇలా..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ ప్రముఖుని బ్యాంకు ఖాతా నుంచి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి రమేశ్, జగిత్యాలకు చెందిన అల్లె సత్యం బ్యాంకు ఖాతాల్లో కొంత సొమ్ము జమైంది. ఈ సొమ్మును కస్టమర్లకు తెలియకుండానే పుణెకు చెందిన మరో వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి సైబర్ నేరగాళ్లు మళ్లించారు. విచారణ చేపట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు.. బుధవారం ఇద్దరు బ్యాంకు ఖాతాదారులను అదుపులోకి తీసుకుని ఆ రాష్ట్రం తీసుకెళ్లారు. ఈ విషయం తెలియడంతో వివరాలు, బ్యాంకు పాసుపుస్తకాలు, ఫోన్‌నంబర్లు ఇచ్చిన కొందరు ఆందోళన చెందుతున్నారు.
క్రిమినల్స్ ఇచ్చే సొమ్ముకు ఆశపడుతున్న జిల్లావాసులు
ఒక్కో అకౌంట్‌లో రూ.2 కోట్ల – రూ.3 కోట్ల వరకు జమ
ఆ తర్వాత మరో ఖాతాకు బదిలీ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
జగిత్యాలలో 16 నెలలుగా కొనసాగుతున్న దందా
క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని కటకటాల పాలవుతున్న కస్టమర్లు
విచారణ చేపడతాం
జగిత్యాలలో సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతా పుస్తకాలు, ఫోన్‌నంబర్లు ఇచ్చి మోసపోయిన వారు ఎవరైనా ఉంటే మాకు ఫిర్యాదు చేయండి. నిందితులను గుర్తించి తగిన చర్య తీసుకుంటాం. బ్యాంక్ ఖాతాలపైనా విచారణ జరుపుతాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.
– అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment