ఎదురెదురుగా రెండు లారీలు ఢీ
● ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలు
మల్యాల(చొప్పదండి): ఎదురెదురుగా రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడిన సంఘటన మల్యాల ముత్యంపేటలో చోటుచేసుకుంది. రాజస్థాన్ నుంచి గ్రానైట్ లోడ్‌తో కరీంనగర్‌వైపు వెళ్తున్న లారీ, పత్తి లోడుతో గుజరాత్‌కు వెళ్లేందుకు కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న లారీ మల్యాల మండలం ముత్యంపేట శివారులోని జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం వేకువజామున ఎదురెదురుగా ఢీకొ న్నాయి. రెండు లారీల ముందుభాగం నుజ్జునుజ్జుకాగా, పత్తి లారీ డ్రైవర్ కె.వీరయ్య(28), గ్రానైట్ లారీ డ్రైవర్ దేవలాల్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. ఇద్దరు డ్రైవర్లతో పాటు పత్తి లోడు లారీలో ఉన్న మరో వ్యక్తి శ్రీనివాస్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు మల్యాల బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ సురేశ్, హోంగార్డు సంపత్ సంఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీతో క్యాబిన్లలో ఇరుక్కున్న డ్రైవర్లను బయటకు తీసి 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఆమె నేత్రాలు సజీవం
కరీంనగర్‌టౌన్: కరీంనగర్‌లోని పాతబజార్‌కు చెందిన నీల రాజేశ్వరి (70) గురువారం రాత్రి మృతి చెందగా..ఆమె కోరిక మేరకు శుక్రవారం ఆమె కుమారుడు నీల రమేశ్, కోడలు మాధవిలతలు నేత్రదానం చేశారు. నేత్రాలను ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలకు పంపించారు. కార్యక్రమంలో ఇంజినీర్ కోల అన్నారెడ్డి, చింతల కిషన్ పటేల్, కరీంనగర్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ముక్క శరత్‌కృష్ణ, మ్యాడం శివకాంత్, బట్టు వినోద్ కుమార్, సుధాకర్ రెడ్డి, రాంబాబు, రజిత, శ్రీకాంత్, రజిని, నాగరాజు, బంధుమిత్రులు పాల్గొన్నారు.
దాడి కేసు నిందితుల గుర్తింపు
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్‌కు చెందిన బీజేపీ నాయకుడు దుబ్బాక రమేశ్‌పై బుధవారం ఉదయం మోతె బైపాస్‌రోడ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి దాడిచేసి పారిపోయారు. కేసు నమో దు చేసిన పోలీసులు గురువారం నిందితులను గుర్తించారు. శుక్రవారం అదుపులోకి తీసుకుని, కారును సీజ్ చేసినట్లు సమాచారం. పథకం ప్రకారమే దాడి చేసినట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్లు సమాచారం.
ఘనంగా గంగా హారతి
ధర్మపురి: కార్తీకమాసం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గంగాహారతి కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆలయం నుంచి గోదావరి నదికి మేళతాళాలు, మంగళవాయిద్యాలతో వెళ్లి, ప్రత్యేక పూజలు చేశారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● అనాథలుగా మారిన ఇద్దరు ఆడపిల్లలు
హుజురాబాద్: పట్టణంలోని సైదాపూర్ రోడ్డు క్రాస్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన వకుళాభరణం రమేశ్(53) వృత్తిరీత్యా హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతున్న క్రమంలో ఓ కారు అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి వెనుకనుంచి ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. రమేష్ భార్య గతంలోని మృతిచెందగా, ఇప్పుడు ఇతని మరణంతో ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment