● రూ.2 లక్షలిస్తేనే ఒకే.. లేదంటే కొర్రీలే ● రా మిల్లు నుంచి బాయిల్డ్ మారాలంటే ఇంతే ● తలనొప్పిగా టాస్క్‌ఫోర్స్ అధికారి వ్యవహారం ● ఉమ్మడి జిల్లాలో ఇదో దందా
కరీంనగర్ అర్బన్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తు పలువురు టాస్క్‌ఫోర్స్ అధికారుల వ్యవహారం ఉమ్మడి జిల్లాలో కలకలం రేపుతోంది. రా రైస్ మిల్లుల నుంచి బాయిల్డ్ రైస్‌మిల్లులకు మారేందుకు మిల్లర్లు మొగ్గు చూపుతున్నారు. ఇందుకు అధికారిక అనుమతులు అవసరం కాగా సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ పేరిట మామూళ్ల వేట మిల్లర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలే అప్పులతో బాయిల్డ్ మిల్లుకు మారుతున్నవారు కొందరు కాగా.. కొత్తగా బ్యాంకు రుణాలతో మిల్లులు ఏర్పాటు చేసుకున్నవారు మరికొందరు.
కప్పం కట్టాల్సిందే
రా రైస్ మిల్లులతో ఇబ్బందులుండటంతో పలువురు బాయిల్డ్ మిల్లుకు మారుతున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో మిల్లర్లలో పావు వంతు ఇదే ఆలోచన. రా మిల్లుతో క్వింటాల్‌కు 67కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా నూక ఎక్కువగా వస్తో్‌ంది. మిల్లర్లకు లాభసాటి లేకపోవడంతో బాయిల్డ్‌కు మారుతున్నారు. బాయిలర్లు, కుండీలు, పొగ గొట్టాలు, ఇతర పరికరాలను బిగించుకున్నారు. కొత్త మిల్లులు కూడ ఏర్పాటవుతుండగా అనుమతులకు దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో కాలుష్య నియంత్రణ మండలి, వరంగల్ బోర్డు నుంచి అనుమతులు తీసుకోగా బాయిల్డ్ మిల్లుకు అనుమతించాలని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు దరఖాస్తు చేశారు. జిల్లా అధికారులు సర్టిఫై కోసం సివిల్ సప్లయ్ కమిషనర్‌కు నివేదించగా సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు చేసి సర్టిఫై చేయాల్సి ఉంటుంది. సదరు అవకాశాన్ని ఆసరా చేసుకున్న బృందంలోని పలువురు అధికారులు అక్రమ సంపాదనకు రుచి మరిగారు. దరఖాస్తు చేసుకున్న మిల్లర్ల ఫోన్ నంబర్లను సేకరించి బేరంరసారాలకు దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రెండు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఫైల్ కదలదంటున్నారు.
కొత్త అధికారులే కీలకం
టాస్క్‌ఫోర్స్ బృందంలో పదవీ విరమణ పొందిన విశ్రాంత ఎస్పీతో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలను తీసుకుంటారు. విశ్రాంత ఎస్‌ఐల్లోని వ్యక్తులే ఈ రకం దందాకు తెరలేపినట్లు సమాచారం. వాస్తవానికి సర్టిఫై ఇవ్వడానికి సదరు అధికారులకు సంబంధం లేదు. అయినా ఉన్నతాధికారులకు తెలియకుండా గోప్యంగా మామూళ్లను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తప్పుదారి పట్టిస్తున్నారని మిల్లర్లు వాపోయారు. గతంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులే అనుమతులు ఇవ్వగా అకున్ సబర్వాల్ సివిల్ సప్లయ్ కమిషనర్‌గా పనిచేసిన కాలంలో సివిల్ సప్లయ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ సర్టిఫై తప్పనిసరని జీవో జారీ చేశారు. అప్పటి నుంచి హైదరాబాద్ అధికారులే అనుమతులకు కీలకమయ్యారు.
రేషన్ బియ్యం దందాలోనూ లీకులు
రేషన్ బియ్యం దందాకు సైతం కొందరు అధికారులు ఆజ్యం పోస్తున్నారు. రేషన్ అక్రమ దందాను అడ్డుకోవాల్సిది పోయి అక్రమార్కులకు సమాచారం చేరవేయడంలో ముందుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఉమ్మడి జిల్లాలో రేషన్ కింగ్‌పిన్‌లుగా వ్యవహరిస్తున్నవారికి టాస్క్ ఫోర్స్ బృందం వస్తుందంటే చాలు ఇట్టే తెలిసిపోతుంది. సదరు విశ్రాంత ఎస్‌ఐ సమాచారం ఇస్తుండటంతో అక్రమార్కుల దందా మూడు పువులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. కాగా..వసూళ్ల విషయం తమ దృష్టికి రాలేదని సివిల్ సప్లయ్ అధికారులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment