పనులకే ప్రాధాన్యం
● నేడు బల్దియా సమావేశం ● 38 అంశాలతో ఎజెండా ● దుకాణ సముదాయాల కేటాయింపు
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ ప్రస్తుత పాలకవర్గ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనున్నందున, అభివృద్ధి పనులకు ప్రాధాన్యం పెరిగింది. తమ పదవీకాలం ముగిసేలోగా పనులు ప్రారంభించాలనే లక్ష్యంతో కార్పొరేటర్లు దృష్టి సారించారు. ఈ క్రమంలో శనివారం జరుగుతున్న నగరపాలకసంస్థ సర్వసభ్య సమావేశంలోనూ అభివృద్ధి పనుల కేటాయింపునకే ఎక్కువ డిమాండ్ ఉండనుంది. మేయర్ యాదగిరి సునీల్‌రావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో 38 అంశాలతో ఎజెండాను రూపొందించారు.
ఆదాయం పెంపుపై నజర్
అప్పులతో తిప్పలు పడుతున్న నగరపాలకసంస్థ ఆదాయాన్ని కాస్త పెంచుకునేందుకు చర్యలు చేపట్టింది. సర్వసభ్య సమావేశంలో 38 అంశాలతో ఎజెండాను రూపొందించారు. ఇందులో దుకాణ సముదాయాల వేలం, పార్క్‌ల లీజు, కళాభారతి అద్దెకు ఇవ్వడం తదితర అంశాలున్నాయి. పెండింగ్‌లో ఉన్న దుకాణ సముదాయాల కేటాయింపునకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వెనుకాల 126 దుకాణాలతో సముదాయాన్ని నిర్మించారు. వీటిలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 8, దివ్యాంగులకు 4, నాయిబ్రాహ్మణులు, వాషర్మెన్ సొసైటీకి 6, స్వయం సహాయక సంఘాలకు 13 కేటాయించారు. గతంలోనే ఈ దుకాణాల కేటాయింపు ప్రక్రియ మొదలు పెట్టినప్పటికి, కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయింది. కోర్టు ఆదేశాల మేరకు 39 మంది, మెప్మా పరిశీలనతో 13 మందితో మరో జాబితాను రూపొందించారు. 39 జాబితాలో ఇద్దరు వీధివ్యాపారులకు సంబంధించి వారి కుటుంబ సభ్యుల పేర్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. శాతవాహన యూనివర్సిటీ వద్ద నిర్మించిన 25 షాప్‌లను కూడా లాటరీ ద్వారా కేటాయించేందుకు నిర్ణయించారు. ఆధునిక హంగులతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ పార్క్ నిర్వహణకు ఏడాదికి రూ.20 లక్షల చొప్పున, జ్యోతిబాపూలే పార్క్ నిర్వహణకు రూ.10 లక్షల చొప్పున లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇటీవల ఆధునీకరించిన కళాభారతిని అద్దెకు ఇవ్వడం ద్వారా నగరపాలకసంస్థకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టారు. సాధారణ వ్యక్తులకు రూ.10 వేలు, కళాకారులకు అయితే రూ.5 వేలు అద్దె నిర్ణయించారు.
అభివృద్ధి పనులు కావాలి
తమ పదవీకాలానికి కౌంట్‌డౌన్ మొదలవడంతో ఆ లోగా తమ డివిజన్‌లో మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు కార్పొరేటర్లు హడావుడి పడుతున్నారు. సీఎం హామీ పథకం కింద చేపట్టిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం, మరే ప్రత్యేక నిధులు రాకపోవడంతో డివిజన్‌లలో పనులు జరగడం లేదు. దీనితో బిల్లుల సకాలంలో రానప్పటికి రూ.23 కోట్ల సాధారణ నిధులతోనే టెండర్ పిలిచారు. నిధులేవైనా మరిన్ని పనులకు టెండర్ పిలిచేందుకు కార్పొరేటర్లు ఒత్తిడి పెంచుతున్నారు.
కోతులు.. కుక్కలు
నగరంలో కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రతి సమావేశంలో చర్చిస్తున్నా, సమస్యకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. నగరవ్యాప్తంగా కుక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో, కాలనీల్లో గుంపులుగా సంచరిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్నాయి. అలాగే కోతులు ఇండ్లల్లోకి దూరి సామగ్రిని ఎత్తుకెళుతున్నాయి. కుక్కలు, కోతులతో ప్రజల భయభ్రాంతులకు గురవుతున్నారు. పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment