
చిన్నారి మృతదేహానికి పంచనామా
వేములవాడరూరల్: బాలుడు మృతికి వైద్యులే కారణమంటూ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీస్‌శాఖ, వైద్యశాఖ అధికారుల, మండల మేజిస్ట్రేట్ అబుబాకర్ సమక్షంలో బుధవారం బాలుడికి పంచనామా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్‌కు చెందిన దండి రాజశేఖర్ – గీతాంజలికి గతనెల 18న కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొడుకు పుట్టాడు. శిశువు ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో వెంటనే మరో ఆస్పత్రికి, అక్కడినుంచి హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానకు తరలించగా శిశువు మృతిచెందాడు. దీంతో ఖననం చేసిన కుటుంబ సభ్యులు గతనెల 29న చిన్నారి మృతికి ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులే కారణమంటూ కరీంనగర్ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై బుధవారం కరీంనగర్ పోలీసులు చంద్రశేఖర్, దీపక్‌కుమార్, వైద్యులు ప్రణతిరెడ్డి వేములవాడ రూరల్ మేజిస్ట్రేట్ అబుబాకర్ సమక్షంలో ఖననం చేసిన చిన్నారికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కరీంనగర్: ఇండియన్ ఆర్మీలో నియామకం కోసం ఔత్సాహిక అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పన అధికారి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఆర్మీలో వివిధ కేటగిరీల వారీగా అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్), ట్రేడ్స్‌మెన్‌కు పదో తరగతి పాస్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (8వ తరగతి పాస్) ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. అభ్యర్థులు వారి అర్హత ఆధారంగా ఏవైనా రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు ఈనెల 10 వరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. సలహాలు సూచనలకు సికింద్రాబాద్‌లోని రిక్రూటింగ్ కార్యాలయం 040–27740205 నంబర్‌లో సంప్రదించవచ్చని ఆయన పేర్కొన్నారు.
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం
మెట్‌పల్లి: పట్టణంలోని సాయిరాంకాలనీలో శ్యామల అనే మహిళ ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసే శ్యామల బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. సాయంత్రం రాగా తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలో ఉంచిన 13తులాల బంగారు ఆభరణాలు, 20తులాల వెండి ఆభరణాలు కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. డీఎస్పీ రాములు, సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
చికిత్స పొందుతూ యువరైతు మృతి
ఇల్లందకుంట: పంటనష్టంతో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన యువరైతు చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ ఘటన ఇల్లందకుంట మండల పరిధిలోని సిరిసేడులో చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వంగ మధు(28) తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. సోదరుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మధు గ్రామంలో మూడెకరాల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని ఆడమగ వరి, మొక్కజొన్న సాగు చేశాడు. పంటనష్టం రావడంతో పాటు పెట్టుబడికి అప్పులు చేశాడు. వాటిని తీర్చే మార్గం లేదని భావనతో గతనెల 30న పంటచేను సమీపంలో పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.