
అంకుల్ ఫోన్ చేసుకుంటాం అంటూ..
● ఆర్టీసీ డ్రైవర్ సెల్‌ఫోన్‌తో ఉడాయించిన యువకులు
● డయల్ 100కు ఫోన్ చేస్తే స్పందించని పోలీసులు
శంకరపట్నం: ‘అంకుల్ మా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఒకసారి మీ ఫోన్ ఇస్తే.. ఒక కాల్ చేసుకుని ఇస్తాం’.. అంటూ ముగ్గురు యువకులు ఓ ఆర్టీసీ డ్రైవర్‌కు చెందిన సెల్‌ఫోన్ తీసుకుని ఉడాయించారు. ఈ ఘటన శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితుడి వివరాల ప్రకారం.. మొలంగూర్ గ్రామానికి చెందిన సాయిరెడ్డి మెట్‌పల్లి డిపోలో ఆర్టీసీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి మొలంగూర్ క్రాస్‌రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు దిగాడు. ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సాయిరెడ్డికి ముగ్గురు యువకులు తారసపడ్డారు. ‘అంకుల్ మా ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. ఫోన్ చేసుకుంటాం. ఒకసారి ఫోన్ ఇస్తారా’ అని అడగడంతో సాయిరెడ్డి ఇచ్చాడు. వెంటనే బైక్ స్టార్ట్‌చేసి ముగ్గురు యువకులు సెల్‌ఫోన్‌తో ఉడాయించారు. సమీపంలోని ఇంటికి పరుగెత్తుకెళ్లిన సాయిరెడ్డి ఇంట్లో బ్యాగ్ పెట్టి, బైక్ తీసుకుని యువకులను వెంబడించాడు. జమ్మికుంటలో వారిని పట్టుకున్నాడు. రూ.1000 ఇస్తే సెల్‌ఫోన్ ఇస్తామని ఆ యువకులు చెప్పారు. ఇవ్వననడంతో మరోసారి సాయిరెడ్డి కళ్లుగప్పి పరారయ్యారు. సాయిరెడ్డి హడావుడిగా బయటికి వెళ్లడం గమనించిన ఆయన భార్య ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుతో డయల్ 100ను సంప్రదించింది. వారినుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌కు శనివారం ఫిర్యాదు చేసేందుకు సాయిరెడ్డి వెళ్లాడు. వారు జమ్మికుంటలో ఫిర్యాదు చేయమన్నారని, జమ్మికుంట పోలీసులు కేశ వపట్నంలో ఫిర్యాదు చేయాలని అంటున్నారని తెలిపాడు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు
ఓదెల(పెద్దపల్లి): వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం.. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన తెట్టె సురేశ్ గోపరపల్లిలో చేపట్టిన సీసీరోడ్డు పనులు చేసేందుకు వచ్చాడు. భోజన విరామ సమయంలో గోపరపల్లి నుంచి పెగడపల్లికి బైక్‌పై వెళ్తున్నాడు. ప్రమాదవశాత్తు అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలపగిలి తీవ్రగాయాలు కావడంతో సుల్తానాబాద్‌లో ప్రాథమిక చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలించారు.
బైక్ అదుపుతప్పిన మరో ఘటనలో..
మడక గ్రామానికి చెందిన పోశారం సారంగపాణి బైక్‌పై పొత్కపల్లి నుంచి మడకకు వస్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశావాత్తు బైక్ అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. 108 సిబ్బంది సుల్తానాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.