నేడు ‘నిధి ఆప్‌ కే నికట్‌’ | - | Sakshi
Sakshi News home page

నేడు ‘నిధి ఆప్‌ కే నికట్‌’

Published Fri, Sep 27 2024 12:38 AM | Last Updated on Fri, Sep 27 2024 12:38 AM

నేడు ‘నిధి ఆప్‌ కే నికట్‌’

ఖమ్మం సహకారనగర్‌: ఎంప్లాయీస్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌(ఈపీఎఫ్‌ఓ) ఆధ్వర్యాన ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం నిధి ఆప్‌ కే నికట్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్లు కె.సునీల్‌, రబీలాల్‌దాస్‌ తెలిపారు. ఖమ్మం జిల్లా ఉద్యోగులు, పెన్షనర్లకు మధిర పంచాయతీ కార్యాలయంలో, భద్రాద్రి జిల్లా వాసులకు లక్ష్మీదేవిపల్లిలోని త్రివేణి హైస్కూల్‌ యమునా క్యాంపస్‌లో కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9–15నుంచి సాయంత్రం 4 గంటల వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

100 పడకల ఆస్పత్రికి గ్రీన్‌సిగ్నల్‌ !

5.10ఎకరాల భూమి కేటాయింపు

కూసుమంచి: కూసుమంచి మండలంలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి తెలిపినట్లు సమాచారం. మండలంలోని గట్టుసింగారం – గంగబండ తండా మద్య కేజీబీపీ సమీపాన అధికారులు ఇటీవల పరిశీలించి 5.10 ఎకరాల స్థలాన్ని గుర్తించారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడంతో ఆస్పత్రి ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. కాగా, స్థలం పత్రాలను శుక్రవారం సంబంధిత శాఖ అధికారులకు అప్పగిస్తామని తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌ తెలిపారు. పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల సమయాన ఇచ్చిన హామీ మేరకు 100పడకల ఆస్పత్రి మంజూరు చేయించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేడు లకారంలో

సాంస్కృతిక కార్యక్రమాలు

ఖమ్మం రాపర్తినగర్‌: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పర్యాటక శాఖఅధికారి బి.సుమన్‌చక్రవర్తి తెలిపారు. ‘శాంతి’ అంశంపై ఈ కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. అలాగే, ఈనెల 28వ తేదీన పాఠశాల విద్యార్థినుల కోసం పులిగుండాల (కనకగిరి గుట్ట) టూర్‌ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

ప్రకాష్‌నగర్‌ వంతెనపై మరమ్మతులు ప్రారంభం

రూ1.40కోట్ల అంచనా వ్యయంతో పనులు

ఖమ్మంఅర్బన్‌: ఖమ్మంలోని మున్నేటిపై ఉన్న ప్రకాష్‌నగర్‌ వంతెన మరమ్మతు పనులను ఆర్‌అండ్‌బీ అధికారులు గురువారం ప్రారంభించారు. ఇటీవల భారీ వర్షాలతో వచ్చిన వరదతో వంతెనపై కొన్ని చోట్ల శ్లాబ్‌ పక్కకు జరిగింది. దీంతో రాకపోకలు నిలిపేసిన అధికారులు శ్లాబ్‌ను యథాస్థానంలోకి చేర్చేందుకు విశాఖపట్నంకు చెందిన నిపుణుల సూచనలతో మరమ్మతులు చేపట్టారు. ఇందుకోసం సుమారు రూ.1.40 కోట్లు కేటాయించినట్లు ఆర్‌అండ్‌బీ అధికారి ఒకరు తెలిపారు. వరద ప్రభావం తగ్గిన కొద్ది పనుల్లో వేగం పెంచుతామని వెల్ల డించారు. మున్నేరుపై కేబుల్‌ వంతెన నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ద్వారానే ఈ పనులు చేపడుతున్నట్లు తెలిసింది.

వాయిదా వేయండి.. సీనియారిటీ పెంచండి

ఖమ్మంవ్యవసాయం: ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఉద్యోగుల బదిలీలపై ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ప్రతినిధులు గురువారం వరంగల్‌లో సీఎండీ వరుణ్‌రెడ్డిని కలిశారు. వివిధ విభాగాల అధికారులు, ఉద్యోగులు, కార్మికుల బదిలీలపై కసరత్తు జరుగుతున్న నేపథ్యాన 327, 1104, టీఆర్‌బీకేఎస్‌, సీఐటీయూ తదితర యూనియన్ల ప్రతినిధులు సీఎండీతో చర్చించారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉన్నందున పిల్లల చదువుల దృష్ట్యా ప్రస్తుతం బదిలీలు వాయిదా వేయడమే కాక రెండేళ్ల స్టేషన్‌ సీనియారిటీని మూడేళ్లకు పెంచాలని కోరారు. అయితే, రాష్ట్ర స్థాయి నిర్ణయం మేరకు బదిలీల ప్రక్రియ ఉంటుందని సీఎండీ వివరించినట్లు సమాచారం. అయితే, కొన్నాళ్ల క్రితం బదిలీల కంటే ముందు పదోన్నతులు కల్పించాలని కోరడంతో ఇటీవల ఉద్యోగులు, కార్మికులకు ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ ప్రక్రియ పూర్తవడంతో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను రూపొందించినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో విధివిధానాలు విడుదల చేసి అక్టోబర్‌ మొదటి వారంలోగా ప్రక్రియ పూర్తి చేసే అవకాశముందని తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement