భయపెట్టడంతోనే గిరిజనుల తిరుగుబాటు
● హామీలు అమలు చేసేవరకు వదిలేది లేదు ● మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధు ● లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా ర్యాలీ
ఖమ్మంమయూరిసెంటర్: భూములు ఇచ్చేది లేదని గిరిజనులు రైతులు తొమ్మిది నెలలుగా పోరాడుతున్నా భయపెట్టి లాక్కునేందుకు యత్నించడంతోనే లగచర్లలో తిరగబడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన ఖమ్మం పెవిలియన్ మైదానం నుండి జెడ్పీసెంటర్ వరకు గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు గిరిజనులు పాల్గొనగా మాజీ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ వరంగల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి 1,100 ఎకరాలేగా అని అన్నారని.. ఆయనకు ఇది సాధారణమే అయినా గిరిజనులకు ఆ భూమే జీవనాధారమని తెలిపారు. కేటీఆర్‌ను ఊచలు లెక్కబెట్టిస్తానంటున్న రేవంత్‌రెడ్డి ఆయన ఏం పాపం చేశారో చెప్పాలన్నారు. కాగా, తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను ఎవరూ ఏం చేయలేరని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేసే వరకు పోరాడుతామని పువ్వాడ స్పష్టం చేశారు.
25న మానుకోటలో ధర్నా..
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యాన మహబూబాబాద్‌లో ధర్నాకు సిద్ధమైతే ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. కానీ కోర్టు అనుమతితో ఈనెల 25న అక్కడే ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ మాట్లాడుతూ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనులపై దమనకాండ కొనసాగిందని విమర్శించారు. ఆయన అల్లుడి కంపెనీ కోసం గిరిజన రైతులను వేధిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ అమలు చేయకపోగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, గుండాల కృష్ణ, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment