నేడు మంత్రి పొంగులేటి పర్యటన | - | Sakshi
Sakshi News home page

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

Published Sat, Nov 23 2024 12:16 AM | Last Updated on Sat, Nov 23 2024 12:16 AM

నేడు మంత్రి  పొంగులేటి పర్యటన

నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మంవన్‌టౌన్‌: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉద యం 11గంటలకు భద్రాచలంలో శ్రీ సీతా రామచంద్రస్వామి దర్శించుకోనున్న మంత్రి, ఆతర్వాత చర్ల రోడ్డు ఏఎంసీ కాలనీలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధితో అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే, సాయంత్రం ఖమ్మం రూరల్‌ మండలం తెల్దారుపల్లి, మద్దులపల్లి, గుర్రాలపాడులో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు.

వచ్చేనెల 18నుంచి పరీక్షలు

ఖమ్మం సహకారనగర్‌: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ) 2023–25 బ్యాచ్‌లో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన మొదటి సంవత్సరం విద్యార్థులకు వచ్చేనెల 18నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో పరిశీలించాలని సూచించారు.

ప్రసవం సమయాన

మరణాలను అరికట్టాలి

ఖమ్మంవైద్యవిభాగం: ప్రసవ సమయంలో ఏ ఒక్క తల్లీబిడ్డ మృతి చెందకుండా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బి.కళావతిబాయి సూచించారు. మాతృ మరణాలపై కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణులకు ప్రసవం చేసే సమయాన అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరణాల రేటు తగ్గించొచ్చని తెలిపారు. సుబ్లేడు, మామిళ్లగూడెం, వైరా, కల్లూరు, ముస్తఫానగర్‌, ఎం.వీ.పాలెం పీహెచ్‌సీల్లో ఇటీవల జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ రాజేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్‌ రాజశేఖర్‌గౌడ్‌, ఎంసీహెచ్‌ పీఓ సైదులు, సీహెచ్‌ఐ పీఓ చందునాయక్‌, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌, వివిధ విభాగాల వైద్యులు యామిని, రెహానా బేగం, సాంబశివరెడ్డి, దుర్గ పాల్గొన్నారు.

పాలు, పాల ఉత్పత్తుల రవాణాకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మంవ్యవసాయం: విజయ డెయిరీ నుంచి పాలు, ఇతర ఉత్పత్తులు రవాణా చేసేందుకు వాహనదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్‌ మోహనమురళి తెలిపారు. సత్తుపల్లి, కల్లూరు, కామేపల్లి, ఎర్రుపాలెం, కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మంలోని డెయిరీ, పాల శీతలీకరణ కేంద్రాల నుంచి పాలు, పాల ఉత్పత్తులను హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయానికి రవాణా చేసేందుకు వాహనాల యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్ల డించారు. ఆసక్తి ఉన్నవారు ఖమ్మం రోటరీ నగర్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 28లోగా దరఖాస్తులు అందజేయాలని, వివరాలకు 99598 95460 సంప్రదించాలని సూచించారు.

15మంది ఉపాధ్యాయులకు

నియామకపత్రాలు

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను కాంట్రాక్టు విధానంలో దశల వారీగా భర్తీ చేస్తున్నారు. ఈమేరకు 23 పోస్టులకు గాను దరఖా స్తులు స్వీకరించగా అర్హులైన 15మందికి శుక్రవారం నియామక పత్రాలు అందించినట్లు జీసీడీఓ తులసి తెలిపారు. తద్వారా గణితం, ఇంగ్లిష్‌, సోషల్‌, బాటనీ సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీరగా మిగతా పోస్టులు కూడా త్వరలో భర్తీ చేస్తామని వెల్లడించారు.

ఆంగ్ల ఉపాధ్యాయులకు శిక్షణ

ఖమ్మం సహకారనగర్‌: ‘వీ కెన్‌ లెర్న్‌’ పేరిట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్‌లో శిక్షణ ఇస్తుండగా రెండో దశలో 17 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల ఇంగ్లిష్‌ ఉపాధ్యాయులకు ఖమ్మం శాంతినగర్‌ హైస్కూల్‌లో శుక్రవారం శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సోమశేఖరశర్మ మాట్లాడుతూ ఆరో తరగతి నుంచి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ భాషపై పట్టు సాధించి ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాల హెచ్‌ఎం డాన్‌బాస్కో, కోఆర్డినేటర్‌ జె.జగదీష్‌, రిసోర్స్‌పర్సన్లు బి.రామనాథం, శ్రీనివాస్‌, వసంత, సంక్రాంతి రవి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement