మత్స్య పాలిటెక్నిక్ ఉందా.. లేదా?!
పాలేరుకు మంజూరు చేసిన గత ప్రభుత్వం
● అప్పట్లో పదెకరాల స్థలం కేటాయింపు ● రూ.32కోట్ల నిధులు కేటాయించినా విడుదల చేయని వైనం ● ఫలితంగా ముందుకు పడని అడుగులు
కూసుమంచి: తెలంగాణలోనే తొలి మత్స్య పరిశోధనా కేంద్రం మండలంలోని పాలేరులో ఉంది. ఇక్కడ చేపల రకాలపై అధ్యయనం, మత్స్యకారులకు శిక్షణ కార్యమ్రాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇదేక్రమాన కేంద్రానికి అనుబంధంగా విద్యార్థుల కోసం మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2022లో రూ.32 కోట్ల నిధులను సైతం కేటాయించింది. ఆపై సార్వత్రిక ఎన్నికలు రావడంతో కళాశాల ఏర్పాటు, నిధుల మంజూరు అంశాలు మరుగున పడ్డాయి. ఆతర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా కళాశాల ఏర్పాటులో కదలిక లేకపోవడంతో గత రెండేళ్లుగా విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. అంతేకాక మత్స్య పాలిటెక్నిక్‌పై ఆసక్తి ఉన్న వారు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
నిధులు విడుదలలో ఆలస్యంతో..
గత ప్రభుత్వం కళాశాలను మంజూరు చేసి, నిధులు కేటాయించినా విడుదల చేయలేదు. దీంతో కళాశాల నిర్వహణకు అవసరమైన భవనాల నిర్మాణంలో జాప్యం జరిగింది. అయితే, నిర్మాణం పూర్తయ్యేలోగా తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహించాలన్నా పాలనా, తరగతి గదుల గుర్తింపు, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం కనీసం రూ.5 కోట్ల నిధులు అవసరం. అయితే, ఈ నిధులను ప్రస్తుత ప్రభుత్వమైనా విడుదల చేస్తేనే తరగతుల నిర్వహణకు వీలవుతుంది. ఇదే జరిగితే రాష్ట్రంలోనే తొలి మత్స్య పాలిటెక్నిక్ కళాశాల పాలేరులో ఏర్పాటుకానుంది.
మంత్రులు స్పందిస్తే..
పాలేరుకు మత్స్య పాలిటెక్నిక్ కళాశాల మంజూరైనా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. అంతేకాక జిల్లా నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. వీరు కళాశాల ఏర్పాటు, తరగతుల నిర్వహణకు అనుమతులు ఇప్పిస్తే మత్స్య పాలిటెక్నిక్‌పై ఆసక్తి ఉన్న తెలంగాణలోని విద్యార్థులు పొరుగున ఉన్న ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఇక్కట్లు తప్పుతాయి.
2022లో స్థలం కేటాయింపు..
మత్స్య పాలిటెక్నిక్ నిర్మాణానికి 2022లో జుజుల్‌రావుపేట రెవెన్యూ పరిధి 355 సర్వే నంబర్‌లోని పదెకరాల ఎన్నెస్పీ స్థలాన్ని గుర్తించారు. సర్వే అనంతరం ఎన్నెస్పీ అధికారులు ఆ స్థలాన్ని మత్స్యశాఖకు అప్పగించారు. ఆపై 20 సీట్లతో మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పూర్తి చేసిన వారు పాలిసెట్‌లో అర్హత సాధిస్తే ఇక్కడ రెండేళ్ల కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
అన్ని ప్రతిపాదనలు పంపించాం...
గత ప్రభుత్వ హయాంలో పాలేరులో మత్స్య పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కాగా, తరగతుల నిర్వహణకు అవసరమైన ప్రతిపాదనలను యూనివర్సిటీకి పంపించాం. తరగతులు నిర్వహించేందుకు బోధన సిబ్బంది కూడా సిద్ధంగానే ఉన్నాం. తొలుత తరగతుల నిర్వహణ, ఇతర అవసరాలకు కొంత నిధులు విడుదల చేయాల్సి ఉంది. నిధులు కేటాయించి విద్యార్థులను కేటాయిస్తేతరగతులు ప్రారంభమవుతాయి.
– శ్యాంప్రసాద్, ప్రధాన శాస్త్రవేత్త,
పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment