‘కమ్మ’ వన సమారాధనకు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మంమయూరిసెంటర్: కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యాన ఈనెల 24న ఆదివారం ఖమ్మం వెలుగుమట్లలోని అర్బన్ పార్క్‌లో నిర్వహిస్తున్న వన సమారాధనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎర్నేని రామారావు, గొడవర్తి నాగేశ్వరరావు తెలిపారు. పార్క్‌లో శుక్రవారం వారు ఏర్పాట్లను పరిశీలించాక మాట్లాడారు. సుమారు 40 వేల మంది హాజరు కానుండగా, నగరంలోని ముఖ్య కూడళ్ల నుంచి పార్క్ వరకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిర్వహణ కమిటీ సభ్యులు రావూరి సైదుబాబు, నల్లమల ఆనంద్, బండి మాధవరావు, మందడి నరేష్‌చౌదరి, నల్లమల రంజిత్‌చౌదరి, ఊట్ల మురళి, జెట్ల శ్రీను, తూము శివ, చండ్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కల్లూరు విద్యార్థి
కల్లూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన వచ్చేనెల 6నుంచి జమూకాశ్మీర్‌లో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో కల్లూరు శాంతినగర్‌కు చెందిన మాతిపోగు లాస్య పాల్గొననుంది. అండర్–17 విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర జట్టుకు ఆమె ఎంపికై ంది. హకీంపేటలోని క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న లాస్య జమ్మూకాశ్మీర్‌కు వెళ్లేందుకు అయ్యే ఖర్చులు సమకూరుస్తామని శాంతినగర్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగి కిన్నెర ఆనంద్ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమెను ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదర్శ్‌కుమార్, స్పోర్ట్స్ స్కూల్ ఆఫీసర్ రతన్‌బోస్, పీఈటీ పసుపులేటి వీరరాఘవయ్య తదితరులు అభినందించారు.
విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించిన బ్యాంకు ఉద్యోగులు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 13 మంది పరీక్ష ఫీజును యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు చెల్లించారు. ఈమేరకు ఫీజు మొత్తం రూ.2,600ను బ్యాంకు మేనేజర్ డి.వినోద్ కుమార్ శుక్రవారం హెచ్‌ఎం ఎన్.జ్యోతికి అందచేశారు. ఉద్యోగులు ముఖేష్, ప్రదీప్‌కుమార్, రవికుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో
పాడిగేదెలు మృతి
చింతకాని: మండలంలోని పందిళ్లపల్లిలో రెండు పాడి గేదెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. గ్రామానికి చెందిన బొందుల సత్యనారాయణ పాడిగేడెలను శుక్రవారం మేత కోసం గ్రామ సమీపంలోని మున్నేరు ప్రాంతానికి తీసుకెళ్లాడు. నీళ్లు తాగేందుకు మున్నేరులోకి దిగిన గేదెలు అక్కడ రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్ల వైర్లకు తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. రూ.1.50 లక్షల విలువైన గేదెలను కోల్పోయిన తనను ఆదుకోవాలని సత్యనారాయణ కోరాడు.
చికిత్స పొందుతున్న
వృద్ధుడు మృతి
కారేపల్లి: డెకరేషన్ సామగ్రిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా తాకడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మండలంలోని పేరుపల్లికి చెందిన పీకె కోటయ్య(70) ఈనెల 15వ తేదీన రహదారి వెంట వెళ్తున్నాడు. అదేసమయాన ఉసిరికాయలపల్లికి చెందిన ఈశ్వర్, సాయి ద్విచక్రవాహనంపై డెకరేషన్ సామగ్రి తీసుకెళ్తుండగా కోటయ్యకు తాకడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై కోటయ్య కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజారాం తెలిపారు.
ఇంటర్ విద్యార్థిపై
పోక్సో కేసు నమోదు
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఆ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ద్వితీయ సంవత్సరం విద్యార్థి కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment