ఇన్‌ఫార్మర్ల పేరిట... ఇద్దరిని హతమార్చిన మావోలు
●మృతుల్లో ఒకరు గ్రామపంచాయతీ కార్యదర్శి ●మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు ●భద్రాచలం నియోజకవర్గం వాజేడులో ఘటన
వాజేడు: పోలీసులకు తమ సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలతో మావో యిస్టులు గురువారం రాత్రి ఇద్దరు గిరిజనులను గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన భద్రాచలం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ములుగు జిల్లా వాజేడులోని పోలీస్‌స్టేషన్‌కు అర కిలోమీటర్ దూరాన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వాజేడు మండలం బాల లక్ష్మిపురం(పెనుగోలు కాలనీ) గ్రామానికి చెందిన వరుసకు సోదరులైన ఉయికె రమేష్(38), ఉయికె అర్జున్(38)ను మావోయిస్టులు విచక్షణారహితంగా గొడ్డళ్లతో నరికి చంపారు. గురువారం రాత్రి 11 గంటల సమయాన అర్జున్ ఇంటికి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. ఆయనను బయటకు తీసుకువచ్చి గొడ్డళ్లతో నరకగా.. అదే సమయాన మరో ముగ్గురు మావోయిస్టులు గ్రామ కార్యదర్శి అయిన ఉయిక రమేష్ ఇంటికి వెళ్లి అడ్డుగా కట్టిన గుడ్డను కత్తులతో కోసి లోపలికి చొరబడ్డారు. బెడ్‌పై పడుకున్న రమేష్‌ను గొడ్డళ్లతో నరికారు. ఆయన కొన ఊపిరితో ఉండగా స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం చేస్తుండగానే కన్నుమూశాడు. కాగా, ఈ ఘటనలో ఎందరు మావోయిస్టులు పాల్గొన్నారనది తెలియరాలేదు. రమేష్‌కు భార్య రాంబాయి, ఒక కూతురు, ఇద్దరు అబ్బాయిలు ఉండగా, అర్జున్‌కు భార్య సావిత్రి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. రమేశ్ పేరూరు గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
లేఖ వదిలిన మావోయిస్టులు
పశువులు కాయడానికి వస్తున్న ఉయికె అర్జున్ మావోయిస్టు దళాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని, రమేష్ కూడా ఇదే పనిచేస్తున్నాడని మృతదేహాల వద్ద వాజేడు, వెంకటపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ వదిలారు. తన స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకుని పోలీసులకు చేరవేస్తూ మావోయిస్టులపై పోలీసులు దాడులు చేయడానికి రమేష్ కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, మృతదేహాలను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘాలు, ఆదివాసీలు శుక్రవారం రాత్రి ఆందోళన నిర్వహించారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము గుట్టలపై జీవిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండేదని, బతుకుదెరువు కోసం కిందకు దిగి వస్తే మావోయిస్టులు హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల నడుమ నలిగిపోతున్నామని వాపోయారు. అడవిలో పనిచేసుకుంటూ బతికే తమను పోలీస్ కొరియర్లుగా చిత్రీకరించి హతమార్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment