
మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వాన
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో సోమవారం భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల మధ్యాహ్నం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కాగా.. సాయంత్రం తర్వాత ఇంకొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. గడిచిన వారంతో పోలిస్తే సోమవారం ఉష్ణోగ్రతలు పెరిగి అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం ప్రకాష్‌నగర్‌లో అత్యధికంగా 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ముదిగొండ మండలం పమ్మిలో 40.3, కొణిజర్లలో 40.2, వైరా, రఘునాథపాలెం, ఖమ్మం ఖానాపురం, మధిరలో 40.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రత ప్రభావం చూపింది.
సాయంత్రం తర్వాత మార్పులు
పలు ప్రాంతాల్లో వాతావరణంలో సాయంత్రం తర్వాత మార్పులు చోటు చేసుకున్నాయి. సత్తుపల్లితో పాటు వైరా, వేంసూరు, సత్తుపల్లి, ఎర్రుపాలెం మండలాల్లో వర్షం కురిసింది. వైరాలో 11.8, వేంసూరు 9, సత్తుపల్లి 7.8, ఎర్రుపాలెంలో 5 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సత్తుపల్లిలో వడగళ్ల వాన కురవగా రైతులు ఆందోళన చెందారు. ఇక రాత్రి ఖమ్మంలోనూ ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడా వర్షపు జల్లులు కురిశాయి. ఈ కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే, వర్షంతో వరి, మొక్కజొన్న కోతలు పూర్తిచేసిన రైతులే కాక మామిడి తోటల యజమానులు ఆందోళనకు గురయ్యారు.
చల్లబడిన వాతావరణం
సత్తుపల్లి/ఎర్రుపాలెం: సత్తుపల్లి మండలంలో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులకు తోడు పలు చోట్ల వనగండ్ల వాన కురిసింది. దీంతో మామిడి కాయలు నేలరాలగా, వివిధ ప్రాంతాల్లో ధాన్యం, మిర్చి తడిసిపోయాయి. ఇక తీగలు తెగడం, లైన్లపై చెట్ల కొమ్మలు పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా సిబ్బంది మరమ్మతుల్లో నిమగ్నమయ్యారు. కాగా, ఎర్రుపాలెం మండలంలోని పలు గ్రామాల్లోనూ వర్షం కురిసింది. కొన్నిచోట్ల మామిడికాయలు నేలరాలాయి. మిర్చి, ధాన్యం రైతులు పంట తడవకుండా పట్టాలు కప్పుకున్నారు. ఇక కేశిరెడ్డిపల్లిలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత
కొన్నిచోట్ల ఈదురుగాలులు, వడగండ్ల వర్షం

మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వాన

మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వాన