అడుగు దూరంలో..!
రెబ్బెన(ఆసిఫాబాద్): చిన్న ఏరియా.. తక్కువ మ్యాన్ పవర్.. బొగ్గు ఉత్పత్తి భారమంతా ఒక్క ఓసీపీ(ఓపెన్ కాస్టు ప్రాజెక్టు)పైనే.. అయినా వార్షిక లక్ష్య సాధనలో అడుగు దూరంలో నిలిచింది. అధిక వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు ఎదురైనా సమష్టి కృషితో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలల 20 రోజుల కాలం మిగిలిఉంది. దీనిని సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని గడువు లోగా పూర్తిచేయాలని సింగరేణి అధికారులు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను వేగవంతం చేసేందుకు అనుగుణంగా ఓబీ పనుల్లో మరింత వృద్ధి రేటు సాధించేలా చర్యలు చేపట్టారు. ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి అనుకున్న రీతిలో సాగాలంటే అందుకు తగినట్లుగా ఓబీ పనులు సాగాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కొనసాగుతున్న ఓబీ వెలికితీత పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులు చూస్తున్నారు.
వార్షిక లక్ష్యం 37.5లక్షల టన్నులు
బెల్లంపల్లి ఏరియాకు ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ 37.5 లక్షల టన్నుల వార్షిక లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉత్పత్తి ఊర్రూతలూగించినా వర్షాకాలం సీజన్‌లో ఉత్పత్తి మందగించింది. ఇతర ఏరియాలతో పోల్చితే బెల్లంపల్లి ఏరియాలోని బొగ్గు గనుల ప్రాంతాలు అటవీ ప్రాంతాల్లో ఉండటంతో వర్షపాతం ఇక్కడ అధికంగా ఉంటుంది. రోజుల తరబడి కురి సిన వర్షాలు ఓసీపీల్లో ఉత్పత్తికి తీవ్ర అటంకాలు సృష్టించాయి. ఏరియాలోని బొగ్గు గనుల భౌగోళిక పరిస్థితులు సైతం ఇతర ఏరియాకు భిన్నంగా ఉన్నప్పటికీ ముందున్న సవాళ్లను అధిగమిస్తూనే ఉత్పత్తిలో ముందుకు సాగుతోంది. వర్షాకాలంలో వానలను దృష్టిలో పెట్టుకుని నెలవారీ ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించుకుంటూ.. మిగిలిన సమయంలో ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచుకుంటూ ప్రణాళికాబద్ధంగా ఉత్పత్తి చేపట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బెల్లంపల్లి ఏరియా 22.44 లక్షల టన్నులకు 20.38 లక్షల టన్నులు సాధించింది. వార్షిక లక్ష్య సాధనలో 91శాతంతో ఏరియా కొనసాగుతోంది. ఆర్థిక సంవత్సరంలో ఇంకా గడువు మిగిలి ఉంది. ప్రస్తుతం బెల్లంపల్లి ఏరియాలో రోజువారీగా 12వేల టన్నులను ఉత్పత్తి చేపడుతుండగా దానిని 14వేల టన్నుల వరకు పెంచాలని యాజమాన్యం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్ణీత సమయంలోగా వార్షిక లక్ష్యాన్ని పూర్తిచేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పెద్దదిక్కుగా ‘కై రిగూడ’
బెల్లంపల్లి ఏరియాలో ఒకప్పుడు పదుల సంఖ్యలో భూగర్భ గనులు ఉండగా కాలక్రమేణా బొగ్గు గనులన్నీ మూతపడ్డాయి. ప్రస్తుతం ఏరియా అంతటికీ ఒకే ఓసీపీ నడుస్తోంది. ఏరియా ఉత్పత్తి భారమంతా దానిపైనే పడుతోంది. ఏరియాలో నూతనంగా గోలేటి ఓసీపీ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా అడ్డంకులు ఇంకా తొలగిపోలేదు. కొత్త ఓసీపీకి ఇంకా పూర్తిస్థాయిలో అనుమతులు రాకపోవడంతో వార్షిక లక్ష్యంలో గోలేటి ఓసీపీకి టార్గెట్‌ను నిర్ణయించిన ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఏరియాలో ప్రస్తుతం ఒక్క కై రిగూడ ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది. ఏరియా వాస్తవ వార్షిక లక్ష్యం 38.5 లక్షల టన్నులు కాగా దానిలో 37.5లక్షల టన్నులు కేవలం కైరిగూడ ఓసీపీ లక్ష్యమే. గోలేటి ఓసీపీని ప్రారంభించి లక్ష టన్నులు ఉత్పత్తి చేపట్టాలని అధికారులు భావించినా.. అనుమతుల రాక గోలేటి ఓసీపీ ప్రారంభానికి నోచుకోలేదు. అయినా కైరిగూడ ఓసీపీ ద్వారా అనుకున్న రీతిలో ఉత్పత్తి కొనసాగుతుండటంతో నిశ్చింతంగా ఉన్నారు. గతేడాది ఏరియా వార్షిక లక్ష్యం 32.5 లక్షల టన్నులు కాగా 35లక్షల టన్నులు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఈ ఏడాది సైతం వందశాతం ఉత్పత్తి సాధించి మరోసారి బెల్లంపల్లి ఏరియా ఉత్పత్తిలో ముందు వరుసలో ఉంచేందుకు అధికారులు, ఉద్యోగులు శ్రమిస్తున్నారు.
బెల్లంపల్లి ఏరియా ఉత్పత్తి వివరాలు(టన్నుల్లో)
నెల లక్ష్యం సాధించిన శాతం
ఉత్పత్తి
ఏప్రిల్ 3,00,000 3,14,161 105
మే 3,70,000 3,48,429 94
జూన్ 3,00,000 3,36,373 112
జూలై 2,40,000 2,18,170 91
ఆగస్టు 2,40,000 2,40,000 48
సెప్టెంబర్ 2,40,000 1,17,938 49
అక్టోబర్ 2,40,000 1,89,170 79
నవంబర్ 2,50,000 3,38,613 135
డిసెంబర్
(8వ తేదీ వరకు) 96,923 90,997 94
వార్షిక లక్ష్యసాధనలో బెల్లంపల్లి ఏరియా ముందడుగు
మెరుగైన ఉత్పత్తితో ముందుకు..
ఉత్పత్తి భారమంతా కై రిగూడ ఓసీపీపైనే..
గడువులోగా వందశాతం సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలు
వందశాతం సాధిస్తాం
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా గడువు మిగిలి ఉంది. అప్పటిలోగా వందశా తం టార్గెట్ సాధిస్తాం. ప్రస్తుతం రోజుకు 12వేల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నాం. దానిని 14వేల వరకు పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రత్యేక ప్రణా ళికల్లో భాగంగా ప్రస్తుతం రోజుకు 1.20లక్ష ల క్యూబిక్ మీటర్ల ఓబీ తీస్తుండగా.. దానిని 1.35లక్షల క్యూబిక్‌మీటర్ల వరకు తీసేలా చర్యలు చేపడుతున్నాం. అనుకున్నట్లు ఓబీ పనులు సాగిస్తే నిర్ణీత సమయం వరకు వందశాతం ఉత్పత్తి సాధిస్తాం.
– ఎం.శ్రీనివాస్, జనరల్ మేనేజర్, బెల్లంపల్లి ఏరియా
Comments
Please login to add a commentAdd a comment